
ట్రంప్ టారిఫ్లతో ఏపీ రొయ్య విలవిల్లాడుతోంది. సుంకాల ప్రభావంతో ధరలు దిగజారడం, ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టడంతో.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్వా అసోసియేషన్ ప్రతినిధులతో రివ్యూ జరిపారు. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ రొయ్యల ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని.. సీఎం ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఆక్వా అసోసియేషన్ ప్రతినిధులు. దీంతో.. రాష్ట్రస్థాయిలో తగినంత సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సిండికేట్ల ద్వారా రైతులు నష్టపోకుండా.. వంద కౌంట్ రొయ్యకు 220 రూపాయల ధరను ఫిక్స్ చేశారు. రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఏపీలో ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తామేం చేయబోతున్నామో.. రైతులు ఏం చేయాలో వివరంగా చెప్పారు.
సుంకాల భారం నుంచి రొయ్యలకు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని.. ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధిని కాపాడాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మరోవైపు ఆక్వా సమస్యలపై ఓ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న ప్రత్యామ్నాయాలను పరిశీలించి.. ఏపీలో పరిస్థితులు ఎలా చక్కదిద్దాలో సూచనలు చేయనుంది. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయనుంది.
జగన్ ఆగ్రహం..
ఇదిలాఉంటే.. ఆక్వా రంగం సంక్షోభంలో నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆక్వా ధరలు రోజు రోజుకూ పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్నారు. రైతులంతా గగ్గోలు పెడితే.. వైఎస్సార్సీపీ నిలదీస్తే కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ పేర్కొన్నారు. వంద కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా పడిపోయిందని చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..