
ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు నాయుడి 75వ వజ్రోత్సవ జన్మదినం కావడం, ఇదే సమయంలో కుటుంబ సమయాన్ని గడిపేందుకు కూడా ఇది ఒక అరుదైన అవకాశమని భావిస్తున్నారు. 75 ఏళ్ల వయసు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోనే కాక, ఏ వ్యక్తిగత జీవితానికైనా ఒక మైలురాయి. అంతటి ఘనత గల సందర్భాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా జరుపుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు, అభిమానులు, రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది.
ఏటా ఒకసారి కుటుంబంతో కలిసి కొంత సమయం విదేశాల్లో గడిపే ఆనవాయితీ పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మనవడు దేవాన్ష్ వంటి చిన్నారి పెరుగుతున్న క్రమంలో ఆయన్ను దగ్గరగా గడిపేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నాలు మానవీయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 1:15 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా పాల్గొంటారు. విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి ఏప్రిల్ 21వ తేదీ అర్ధరాత్రి అమరావతికి చేరుకుంటారు.
గత 10 నెలలుగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి వేగాన్ని అందుకోవడం కోసం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాలన ప్రారంభమైన తర్వాత ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. వయసు 75 అయినా, వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతున్న చంద్రబాబు.. ఈసారి వ్యక్తిగత క్షణాలను కుటుంబంతో గడిపేందుకు ప్రయాణిస్తున్నారు. జన్మదినం వేడుకలను రాజకీయ హడావుడి కాకుండా వ్యక్తిగతమైన అనుభూతిగా మార్చుకోవడంలో ఆయన్ను చాలా మందికి స్ఫూర్తిగా నిలిపే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..