

పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం.. వాటి కోసం పిల్లలు అప్పుడప్పుడు అబద్దాలు చెబుతుంటారు.. ఇంట్లో చెప్పకుండా డబ్బులు తీసుకుని చాక్లెట్స్ కొనుక్కుతినేవాళ్లు కూడా ఉంటారు. అలాగే, మరికొందరు పిల్లలు షాపు, సూపర్ మార్కెట్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా చాక్లెట్ కనిపించగానే ఎలాగాలో తినేయాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి పనినే చేశాడు ఓ 13ఏళ్ల బాలుడు.. దానికి ఆ సూపర్ మార్కెట్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. బాలుడని కూడా చూడకుండా చాక్లెట్ చోరీ చేశాడనే నెపంతో చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన 13 ఏళ్ళ బాలుడు మంచాల మండలం నోములలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడు మంగళవారం ఇబ్రహీంపట్నంలో ఉన్న మెగా డీమార్ట్ వద్దకు వస్తువులు కొనడానికి వచ్చాడు. అయితే దుకాణంలో చాక్లెట్ దొంగతనం చేశాడంటూ ఆ బాలుడిని మధ్యాహ్నం 12 గంటల సమయంలో మెగా డీమార్ట్ యజమానులు, నిర్వాహకులు.. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న గోదాములోకి తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచి విపరీతంగా కొట్టారు.
ఎలాగోలా ఈ విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీమార్ట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు కూడా వచ్చారు. బాలుడిని రెస్క్యూ చేసి మొదట స్టేషన్ కు తీసుకెళ్ళారు. తరువాత ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీ మార్ట్ మీద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి