
ఆచార్య చాణక్య రచించిన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. అవి నేటి తరానికి కూడా అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. అలా చాణక్యుడు చెప్పిన మానవ సంబంధాల్లో ఒకటి పెళ్లి.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక పెళ్లి. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు. రానున్న జీవిత భాగస్వామి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన పెళ్లి విషయంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలను తీసుకోవద్దని.. జీవితానికి సరైన భాగస్వామిని ఎంచుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా కొన్ని రకాల లక్షణాలున్న అమ్మాయిని కనుక ఎదురైతే అసలు వదులుకోవద్దు అంటూ యువకులకు సూచిస్తున్నారు చాణక్య. అవి ఏమిటంటే..
సంతృప్తి- సర్దుకుపోవడం: తమకు ఉన్నదానితో తృప్తి పడడం.. సర్దుకుపోయే గుణం ఉన్న అమ్మాయిలతో జీవితం ఎంతో బాగుంటుందని చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అమ్మాయిల్లో లేదా అబ్బాయిల్లో దురాశ లేదా అత్యాశ ఉంటే ఈ గుణం వైవాహిక జీవితంపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా దురాశ లేని యువతి ఏ కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. భర్త తో పాటు ఆ యువతి అడుగు పెట్టిన కుటుంబం కూడా ఆనందంగా గడుపుతారు.
కోపాన్ని అదుపులో పెట్టుకునే యువతి: కోపం రావడం అనేది సర్వసాధారణం. అయితే కోపం అనేక అనర్ధాలకు హేతువు. క్షణికావేశం జీవితాన్నే నాశనం చేస్తుంది. కోపం వలన పెద్ద పెద్ద సామ్రాజ్యాలే ధ్వంసం అయినట్లు చరిత్ర చెబుతుంది. అంతేకాదు ఎటువంటి బంధం అయినా కోపం వలన బీటలు పడుతుంది. అందుకే కోపం శత్రువు వంటిది అని అంటారు. అటువంటి కోపాన్ని అదుపులో ఉంచుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ భర్తకు మంచి జీవిత భాగస్వామి అవుతుంది.
ఇవి కూడా చదవండి
సహనం: ప్రతి మనిషికి సహనం ఓర్పు అవసరం. సహనం లేని వ్యక్తులతో స్నేహం కూడా చెయ్యలేం.. అటువంటిది జీవిత భాగస్వామిగా నిండు నూరేళ్ళు ఎలా గడపగలరని చాణక్య ప్రశ్నిస్తున్నాడు.. అంతేకాదు జీవితంలోకి వచ్చే భార్యకు కష్ట సుఖాల్లో తోడూ నీడా నిలబడమే కాదు.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే ఓర్పు, నేర్పు సహనం అవసరం అని చెప్పారు. కనుక ఇటువంటి లక్షణాలున్న యువతి కనుక మీకు కనిపిస్తే జీవిత భాగాస్వమిగా చేసుకోవడంలో ఎటువంటి సంశయం వద్దు అని చెప్పాడు చాణక్య.
సంతోషం: కొంతమంది ఎప్పుడు ఎటువంటి సమయంలోనైనా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారు. అదే సమయంలో కొంతమంది ఎప్పుడూ తాము సంతోషంగా ఉండడమే కాదు.. తమతో ఉన్నవారు కూడా సంతోషంగా ఉండేలా చూస్తారు. కనుక ఇటువంటి లక్షణం ఉన్న యువతితో జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది కనుక.. ఈ లక్షణాలున్న అమ్మాయి కనిపిస్తే.. వెంటనే వివాహం చేసుకోమని అబ్బాయిలకు చాణక్య సలహా ఇచ్చాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు