
2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మెగాటోర్నమెంట్కు దూరంగా ఉండగా, దక్షిణాఫ్రికా కీలక బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ తన కెరీర్లో ఇదే చివరి ఐసిసి టోర్నమెంట్ కావొచ్చని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో కీలకమైన పోరుకు ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “ఇది నా చివరి ఐసిసి టోర్నమెంట్ అయ్యే అవకాశం ఉంది. నా లక్ష్యం ఎల్లప్పుడూ ప్రోటీస్ తరపున ఆడటమే. భవిష్యత్తులో లీగ్‌లను ఆడతానా లేదా మరో కాంట్రాక్ట్ వస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు,” అని డస్సెన్ పేర్కొన్నాడు.
అలాగే, ప్రస్తుత టోర్నమెంట్లో యువ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జీ, మాథ్యూ బ్రీట్జ్కే అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. బ్రీట్జ్కే వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ర్యాన్ రికెల్టన్ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.
దక్షిణాఫ్రికా నాకౌట్ రేసులో నిలవాలంటే ఇంగ్లాండ్‌పై విజయం సాధించాల్సి ఉంటుంది. ఓడితే, ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి.
స్టార్క్ వదిలేసిన ఛాంపియన్స్ ట్రోఫీ
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టులో చోటు దక్కించుకున్న స్టార్క్, ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. దీనికి గల ప్రధాన కారణాన్ని వెల్లడించిన స్టార్క్, తన శరీర ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
“నా చీలమండ నొప్పి ఇబ్బంది పెడుతోంది. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మరియు వెస్టిండీస్ పర్యటనకు సిద్ధం కావాలనుకుంటున్నాను. కొంత ఐపీఎల్ క్రికెట్ కూడా ఉంది. కానీ నా ప్రాధాన్యత టెస్ట్ క్రికెట్. నా శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోవడానికి ఇప్పుడు విశ్రాంతి అవసరం,” అని స్టార్క్ వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్ వంటి యువ బౌలర్లు స్టార్క్ గైర్హాజరును ఎలాంటి ప్రభావం లేకుండా ఉంచారు. ఇక గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో సెమిస్ కు చేరుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ సమరంలో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు సుదీర్ఘ ప్రయాణాన్ని ఎదుర్కొంటున్నాయి. మిచెల్ స్టార్క్ విశ్రాంతి తీసుకుంటూ ఐపీఎల్లో రీఎంట్రీ ప్లాన్ చేయగా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ తన అంతర్జాతీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశాడు. మరి, ఈ టోర్నమెంట్లో ఏ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.