
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో.. కావ్య కాఫీ ఇచ్చినా తాగకుండా అపర్ణ కోపంగా గదిలోకి వెళ్తుంది. అక్కడే ఉండి అదంతా చూసిన రాజ్ వచ్చి.. మా అమ్మని ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. అదొక ఆర్ట్.. అది అందరికీ చేతకరాదని రాజ్ అంటే.. మీకు దమ్ముంటే ముందు మీరు అత్తయ్య గారితో కాఫీ తాగించమని కావ్య అంటుంది. సరేనని రాజ్ లోపలికి వెళ్తాడు. కాఫీ కప్పు పగిలినట్టు.. లాగిపెట్టి ఒక చెంప దెబ్బ ఇచ్చినట్టు సౌండ్ వస్తుంది. రాజ్ బయటకు రాగానే.. ఏరా కాఫీ తాగిందా? అని ఇందిరా దేవి అడుగుతుంది. చల్లారింది అంట.. అక్కడే వదిలేశానని రాజ్ అంటే.. అవునా మరి కాఫీ కప్పు పగిలినట్టు సౌండ్ వచ్చిందే.. లాగిపెట్టి ఒక్కటి ఇచ్చినట్టు కూడా వినిపించిందని ఇందిరా దేవి అంటే.. మమ్మీ మూడ్ బాలేదంట.. తర్వాత మాట్లాడతానందని రాజ్ అంటాడు. ఎందుకు రా లేని పోని డాంభికాలు.. నాకు అర్థమైందిలేనని పెద్దావిడ కావాలని ఆటపట్టిస్తుంది.
కాళ్లు పట్టుకున్న రాజ్, కావ్యలు.. పట్టించుకోని అపర్ణ..
నాకు మమ్మీ సంగతి బాగా అర్థమైంది.. కళావతి నువ్వు వెళ్లి కాఫీ పెట్టమని రాజ్ అంటాడు. జాగ్రత్తరా అక్కడ ఉంది మీ అమ్మ.. ఈ సారి ఏం చేస్తుందోమోనని ఇందిరా దేవి అంటుంది. ఇక కావ్య కాఫీ పెడుతుంది. రాజ్, కావ్యలు వెళ్లి అపర్ణ దగ్గరకు వెళ్తారు.. కాఫీ తీసుకోమని అంటారు. అపర్ణ సీరియస్‌గా ఉంటుంది. వెంటనే అపర్ణ కాళ్ల మీద పడి.. మమ్మల్ని క్షమించు అంటూ తెలుగులో వేడుకుంటారు. ఇక కావ్య, రాజ్‌లు లేచి చూసేసరికి అపర్ణ ఉండదు.. ఇందిరా దేవి ఉంటుంది. నాన్నమ్మా అమ్మ ఏది? అని రాజ్ కంగారుగా అడుగుతారు. మీరు కాళ్ల మీద పడగానే కాఫీ కప్పు నా చేతిలో పెట్టి వెళ్లిపోయిందని చెబుతూ నవ్వుకుంటూ వెళ్లిపోతుంది పెద్దావిడ.
అనామికకు షాక్ ఇచ్చిన కళ్యాణ్..
ఆ తర్వాత అప్పూ, కళ్యాణ్‌లు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే ఎవరో పర్స్ కొట్టేయబోతే.. అప్పూ వెళ్లి అడ్డుకుంటుంది. మీ పర్స్ జాగ్రత్తగా పెట్టుకోమని ఇస్తుంది అప్పూ. అయితే అక్కడ ఉంది సామంత్. అప్పూకి థాంక్స్ చెబుతాడు. పక్కన ఉన్న అనామిక.. చప్పట్లు కొడుతూ వస్తుంది. ఏ అప్పూ నిన్ను చూసి చాలా రోజులు అయింది. ఎలా ఉన్నావని అడుగుతుంది. అప్పూ వెళ్లబోతుండగా ఆపి.. ఇలా రోడ్డున మీద పోయే వాళ్ల పర్స్, చైన్ కూడా సేవ్ చేస్తున్నారా? ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం ఎంత వస్తుంది? పాపం మీ కళ్యాణ్ ఊడిగం చేస్తుంటే ఏమీ రావడం లేదు కదా అని అనామిక అంటే.. చూడు బురదలో రాయి వేయడం ఎందుకు అని నోరుమూసుకుని వెళ్తున్నా.. వెళ్లనీ అని అప్పూ అంటే.. అనామిక ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. డబ్బు కోసం నీలా దిగజారి బతకడం మాకు రాదు.. త్వరలోనే నా భార్య పోలీస్ అవ్వబోతుందని.. కళ్యాణ్ అంటాడు. దీంతో షాక్ అయిన అనామిక.. నేను రాజ్, కావ్యల మీద టార్గెట్ చేసి.. వీళ్ల సంగతి వదిలేశాను. దీని గురించి కూడా ఆలోచించాలని అంటుంది.
ధాన్యలక్ష్మి చేతికి.. హౌట్ హౌస్ పేపర్స్..
ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు పేపర్స్ పట్టుకుని వస్తుంది రుద్రాణి. ఏంటి ఆ పేపర్స్ అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. నువ్వే చదువు అని రుద్రాణి ఇస్తే.. ఆ పేపర్స్ చదివి షాక్ అవుతుంది ధాన్యలక్ష్మి. పది కోట్లకు నా హౌట్ హౌస్‌ని తాకట్టు పెట్టారా.. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందని అంటుంది. మొత్తం ఆస్తులన్నీ సైడ్ వేసుకుంటున్నారు. ఆస్తుల్లో వాటా ఇవ్వకపోగా.. ఇఫ్పుడు అప్పుల్లో వాటా కట్టమంటారు. ఇప్పుడు ఏం చేస్తావని రుద్రాణి అంటే.. ఒక్కొక్కరికి తాట తీస్తాను.. నా వాటా ఆస్తిని నేను ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటాను. ఇంట్లో అందరికీ సౌకర్యాలు లేకుండా చేసి.. ఆస్తుల్ని ఇలా తగలబెడుతుందా? ఏం జరుగుతుంది ఇంట్లో.. అంటూ ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..