
రాజమౌళి వేసిన విత్తు.. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పుణ్యమా అని చెట్టుగా మారిందిప్పుడు. ఈ నీడలోనే చాలా మంది దర్శకులు బాలీవుడ్ వెళ్తున్నారు.
బాలీవుడ్లో తెలుగు దర్శకులకు మామూలు క్రేజ్ లేదిప్పుడు. మేం టాలీవుడ్ నుంచి వస్తున్నాం అని చెప్పేలోపే.. మన దర్శకులపై ఖర్చీఫ్ వేస్తున్నారు బాలీవుడ్ హీరోలు. మనోళ్ల బ్రాండ్ ఆ రేంజ్లో ఉందక్కడ.
ఈ మధ్య కాలంలో తెలుగు దర్శకులు చాలా మంది బాలీవుడ్ వెళ్లారు. అంతెందుకు ప్రస్తుతం సన్నీ డియోల్‌తో జాట్ అంటూ అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి తర్వాత నేరుగా బాలీవుడ్లో ల్యాండ్ అయ్యారు గోపీచంద్. గదర్ 2 తర్వాత సన్నీ డియోల్ నటిస్తున్న జాట్‌పై అంచనాలు మామూలుగా లేవు.
వంశీ పైడిపల్లి కూడా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా కోసమే ప్రయత్నిస్తున్నారు. అమీర్ ఖాన్‌తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకునే పనిలో ఉన్నారు వంశీ. తాజాగా బాబీ సైతం బాలీవుడ్ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. రెండేళ్ళ కింద వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్ కొట్టిన బాబీ.. మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ మాంచి మాస్ హిట్ కొట్టారు.
డాకు మహారాజ్ తర్వాత నెక్ట్స్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బాబీ. ప్రస్తుతానికి ఈయన ఓ హిందీ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశముంది. బాబీ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రావాలంటే మరో రెండు నెలలు టైమ్ పట్టేలా ఉంది.