
ఉదయం నిద్రలేచి వెంటనే చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది ఆరోగ్య స్పృహ కలిగి పాలతో కాఫీ తాగడానికి బదులుగా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు మంచిదా? చెడ్డదా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో అల్సర్లు, పేగు రుగ్మతలు, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం మొదలైన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని తేలింది.
గుండెల్లో మంట సమస్యలను నివారించడానికి పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని అందరూ అనుకుంటారు. అయితే, బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ఉబ్బరం, పొత్తికడుపులో అసౌకర్యం, బిగుతుగా అనిపించడం వంటి అజీర్ణ లక్షణాలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గ్యాస్ట్రిటిస్, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మంచిది కాదు.
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి కూడా వస్తాయి. బ్లాక్ కాఫీ కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం మానుకోవాలి. అలాగే, మీరు ఒత్తిడితో బాధపడుతుంటే బ్లాక్ కాఫీ తాగడం వెంటనే మానేయడం మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.