
ఎండ ప్రభావంతో చర్మంలోని తేమ తగ్గిపోతుంది. చెమట వల్ల చర్మ కణాలు మూసుకుపోయి, నిర్జీవంగా మారతాయి. అందుకే చర్మాన్ని క్రమం తప్పకుండా స్క్రబ్ చేయడం అవసరం. ఈక్రమంలో సహజమైన నూనెలతో మసాజ్ చేసి న్యాచురల్ స్క్రబ్ ఉపయోగించుకోవడం ఉత్తమం. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయడం వల్ల మృతకణాలు తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే రోజుకు మూడు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం ముఖ్యం.
వేసవిలో చర్మ సంరక్షణలో మార్పులు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మాయిశ్చరైజర్ వాడే విధానం. శీతాకాలంలో ఉపయోగించే హెవీ మాయిశ్చరైజర్ వేసవికి సరిపోదు. వేసవి కాలానికి తేలికపాటి, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇది చర్మానికి తేమను అందిస్తూ అధిక చెమటతో ఏర్పడే సమస్యల నుంచి కాపాడుతుంది.
చర్మాన్ని ఎండ ప్రభావం నుంచి రక్షించాలంటే సన్‌స్క్రీన్ తప్పనిసరి. కేవలం బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే కాదు ఇంట్లో ఉన్నప్పటికీ దీనిని ఉపయోగించడం అవసరం. ఇది చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి కాపాడటమే కాకుండా అదనంగా తేమను అందిస్తుంది. కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మంచిది.
సమతులితమైన ఆహారం తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి చాలా కీలకం. వేసవి వేడిలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారకుండా ఉండటానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా మామిడి, బెర్రీస్, పుచ్చకాయ లాంటి పండ్లు తింటే చర్మానికి తేమ లభిస్తుంది.
వేసవి వేడిలో చెమట ద్వారా శరీరంలోని నీరు తగ్గిపోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి, చర్మం పొడిగా మారుతుంది. అందుకే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీటిని తాగడం అవసరం. అదనంగా కూల్ డ్రింక్స్, నారింజ రసం, కొబ్బరి నీళ్లు, పెరుగు వంటి ద్రవ పదార్థాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
బయటకు వెళ్లే సమయంలో ఎండ ప్రభావాన్ని తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కూలింగ్ గ్లాసెస్ ధరించడం, గొడుగు వాడడం, ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకోవడం వంటి చిన్న మార్పులు చర్మాన్ని ఎండ నుంచి కాపాడతాయి. వీలైనంత వరకు మధ్యాహ్న వేళల్లో ఎండలోకి వెళ్లకుండా ఉండడం ఉత్తమం.
ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. వేసవి ఎఫెక్ట్ మీ అందాన్ని దెబ్బతీయదు. సరైన స్కిన్‌కేర్ రొటీన్‌ను పాటించడం ద్వారా ఎండ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుని వేసవిలో కూడా మీ చర్మాన్ని తాజాగా ఉంచుకోండి.