
భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారారు. క్రికెటర్ల భార్యలు, కుటుంబ సభ్యుల పర్యటనల గురించి చేసిన సెన్సషనల్ వ్యాఖ్యలతో పాటు, ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కుటుంబ సభ్యులపై యోగరాజ్ వ్యాఖ్యలు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వరుసగా రెండు టెస్ట్ సిరీస్‌ల పరాజయాల తర్వాత, జట్టులో క్రమశిక్షణను పెంచేందుకు BCCI పలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టింది. వీటిలో ముఖ్యంగా టూర్ సమయంలో కుటుంబ సభ్యులను పరిమిత గడువుకు మాత్రమే అనుమతించే నిబంధన ఉంది. దీనిపై యోగరాజ్ మాట్లాడుతూ, “ఒక ఆటగాడు దేశం కోసం ఆడుతున్నప్పుడు, కుటుంబం జట్టుతో పాటు ఉండకూడదు. ఇది ఆటగాడి దృష్టిని మరలుస్తుంది. భార్యలకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. జట్టే వారి కుటుంబంగా భావించాలి” అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు, అయితే తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.
BCCI కొత్త మార్గదర్శకాలపై మద్దతు
BCCI ఇటీవల క్రికెటర్ల దృష్టిని క్రీడపైనే కేంద్రీకరించేందుకు పలు మార్గదర్శకాలను అమలు చేసింది. ఇందులో వ్యక్తిగత మీడియా షూట్లకు ఆంక్షలు, దేశీయ క్రికెట్లో పాల్గొనడం తప్పనిసరి చేయడం వంటి చర్యలు ఉన్నాయి. యోగరాజ్ సింగ్ ఈ నిర్ణయాలను అభినందిస్తూ, వీటిని భారత క్రికెట్ మేలు కోసం తీసుకున్నవని చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: జట్టు ఎంపికపై..
BCCI ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉంటారు. యోగరాజ్, గిల్‌ను “భవిష్యత్తులో భారత జట్టుకు నాయకత్వం వహించే వ్యక్తి”గా అభివర్ణించారు. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయంఅని, ఇది వారికి నేర్చుకునే గొప్ప అవకాశమని నేను నమ్ముతున్నాను” అని యోగరాజ్ అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. తర్వాత పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు జరగనున్నాయి. భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిసిందే.
యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమైనవైనా, ఆయన BCCI తీసుకొచ్చిన మార్గదర్శకాల పట్ల మద్దతు, రాబోయే క్రికెట్ పథకాలకు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు గెలుపు పథంలో సాగుతుందా? లేదా ఆంక్షలు ప్రతికూల ప్రభావం చూపుతాయా? ఈ ప్రశ్నలు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చలకు దారితీస్తాయో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..