

గర్భిణీ స్త్రీలు బార్లీ నీరు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీటిలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు గర్భంలో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడంలో సహాయపడుతాయి. ఇది బిడ్డ ఎదుగుదలకే కాకుండా తల్లికి శక్తిని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచూ మూత్రనాళ సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సందర్భంలో బార్లీ నీరు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మహిళలు బార్లీ నీరు తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందుతారు. ఇది ముఖ్యంగా ప్రసవం తర్వాత లేదా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే మూత్ర సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. దాంతో పాటు ఈ నీరు శరీరంలోని హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది.
బార్లీ నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న కొవ్వును బంధించి తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఈ నీరు మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. రోజూ బార్లీ నీరు తాగడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది.
బార్లీ నీరు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కూడా తాగడానికి అనువైనది. తక్కువ గ్లైసెమిక్ సూచిక కారణంగా బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది అందువల్ల ఆరోగ్యానికి మంచిది.
బార్లీ నీటిలో విటమిన్లు, ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల శరీరం వైరస్లు, బ్యాక్టీరియా వంటి వ్యాధుల నుండి రక్షించబడుతుంది. తరచూ జబ్బులు పడకుండా ఉండాలంటే ఈ నీటిని రోజూ తాగడం మంచిది.
బార్లీ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తక్కువ కాలంలో కడుపు నిండిపోతుంది. దీనివల్ల ఎక్కువ తినకుండా సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో ఈ నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బార్లీ నీరు తాగడం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని వెంటనే అందజేస్తాయి. కడుపు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఈ నీరు ఉపయోగపడుతుంది.
బార్లీ నీరు ఆరోగ్యానికి మంచిదే కానీ.. దాన్ని మితంగా తాగాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు రావచ్చు. అందుకే వైద్యుల సూచనల మేరకు దాన్ని మితంగా వినియోగించడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)