
బజాజ్ ఆటో కంపెనీకు సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ప్రధాన అమ్మకాల్లో కీలక మైలురాయిని సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. బజాజ్ కంపెనీ మార్చి 2025లో మాత్రమే రికార్డు స్థాయిలో 34,863 యూనిట్లను నమోదు చేసింది. అంటే సగటున ప్రతిరోజూ 1,124 స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంటే ఈ- స్కూటర్ మార్కెట్లో 29 శాతం వాటాను కైవసం చేసుకుంది. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ వార్షిక వాల్యూమ్‌లు 2,30,761 యూనిట్లకు చేరుకున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 1,06,624 యూనిట్లతో పోలిస్తే ఇది 116 శాతం పెరుగుదల అని నిపుణులు చెబుతున్నారు. ఈ విజయంలో ఎక్కువ భాగం రెండు కొత్త మోడల్ లైన్లను ప్రారంభించడం వల్లనే జరిగిందని పేర్కొంటున్నారు. చేతక్ 29 సిరీస్, చేతక్ 35 సిరీస్ ఈవీ స్కూటర్లు 2024లో రెండు లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలకు సాయపడ్డాయి. బజాజ్ చేతక్ 35 సిరీస్ ఫ్లోర్ బోర్డ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీలతో కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ స్కూటర్ 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ దాదాపు 153 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. 950 ఆన్‌బోర్డ్ ఛార్జర్ కారణంగా ఈ స్కూటర్ మూడు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. అలాగే ఈ స్కూటర్లో వచ్చే 4 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారు వల్ల 73 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది.
బజాజ్ చేతక్ 35 సిరీస్‌లో డిజైన్ మెరుగుదలల్లో భాగంగా ఎక్స్టెండెడ్ సీటు, అలాగే ఫ్లోర్ బోర్డ్, 35 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉన్నాయి. 35 సిరీస్‌లో అంతర్నిర్మిత నావిగేషన్, మ్యూజిక్, కాల్ నియంత్రణలతో టచ్ స్క్రీన్ టీఎఫ్టీ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. అలాగే జియో-ఫెన్సింగ్, ప్రమాద గుర్తింపు, థెఫ్ట్ అలెర్ట్, ఓవర్ స్పీడ్ అలెర్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఈ స్కూటర్ల సొంతం. బజాజ్ ఇప్పుడు 507 పట్టణాల్లో డీలర్ షిప్‌లను అందిస్తుంది. అలాగే భారతదేశం అంతటా 4,000 సేల్స్ పాయింట్లు, 3,800 సర్వీస్ వర్క్‌షాప్స్‌తో సేవలున అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..