
చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజూ బాగా పళ్ళు తోముకున్నప్పటికీ, నోటి నుండి దుర్వాసన వస్తుందని, దీని వలన ఇతరులతో మాట్లాడటం కూడా కష్టమవుతుందని కొందరు అంటుంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ కింది సింపుల్ చిట్కాల ద్వారా నోటి దుర్వాసనను వదిలించుకోండి.
లవంగాలు వంటలోనే కాకుండా పలు ఆరోగ్య సమస్యల నివారణలలో కూడా ఉపయోగించే మసాలా దినుసులు. యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగిన లవంగాలను నమలడం వల్ల నోటి దుర్వాసన నుంచి సులువుగా బయటపడవచ్చు.
సోంపు దుర్వాసనను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోవడమేకాకుండా.. కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి పుదీనా ఆకులను కూడా నమలవచ్చు. ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. తాజాదనాన్ని ఇస్తుంది. నోటి దుర్వాసనను తొలగించడానికి యాలకులను కూడా నమలవచ్చు. భోజనం తర్వాత సోంపు గింజలు తిన్నట్లుగా యాలకులను కూడా నమలవచ్చు. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్.
అల్లం రసం ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. అదేవిధంగా నిమ్మరసంతో పుక్కిలించడం వల్ల కూడా నోటి దుర్వాసనను సులభంగా తొలగించుకోవచ్చు.