
ప్రస్తుతం శుక్ర, రవి గ్రహాలు పరమోచ్ఛ స్థితిలో ఉండగా, బుధ, కుజ గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి అతి అరుదుగా మాత్రమే సంభవిస్తుంటుంది. ఇందులో ఉచ్ఛ శుక్రుడు, నీచ బుధుడు మిత్ర గ్రహాలు కాగా, ఉచ్ఛ రవి, నీచ కుజుడు మిత్ర గ్రహాలు. ఇటువంటి విచిత్ర పరిస్థితుల్లో కూడా కొన్ని రాశులు ఈ నాలుగు గ్రహాల వల్ల అత్యంత శుభ యోగాలను, అదృష్ట యోగాలను అనుభవించే అవకాశం ఉంది. శుక్రుడు మే 31 వరకు, రవి మే 14 వరకు ఉచ్ఛలో ఉంటుండగా, బుధుడు మే 6 వరకు, కుజుడు జూన్ 8 వరకు నీచలో ఉండడం జరుగుతోంది. ఈ నాలుగు గ్రహాల ప్రభావం మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల మీద సానుకూలంగా ఉండబోతోంది.
- మిథునం: ఈ రాశికి రాశ్యదిపతి బుధుడితో సహా నాలుగు గ్రహాలూ అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా ఈ రాశివారు అతి తక్కువ స్థాయి నుంచి కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కలుగుతుంది. ఆదాయం విశేషంగా వృద్ధి చెంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, అవసరాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశిలో కుజుడు, భాగ్యంలో శుక్ర, బుధులు, దశమ స్థానంలో రవి ఉండడం వల్ల కొద్ది రోజుల పాటు జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వంలో, రాజకీయాల్లో ఉన్న వారికి రాజయోగాలు పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ధన యోగాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ పట్టడం, ఉచ్ఛ స్థితిలో ఉన్న రవి ఈ రాశిని వీక్షించడం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఈ రాశికి బుధ, కుజులకు నీచభంగం కలిగింది. ఉద్యోగంలో రాజయోగాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి ఈ నాలుగు గ్రహాలూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు అనూహ్యంగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.
- మకరం: ఈ రాశికి శుక్ర, బుధ, కుజ, రవులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో రాజ యోగాలు కలుగుతాయి. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి ఊహించని గుర్తింపు లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- మీనం: నాలుగు గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగాలు పడతాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. ప్రభుత్వ మూలక ధన లాభానికి అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.