
మేషం: ఎటువంటి రిస్కు తీసుకోవడానికైనా రెడీగా ఉండే ఈ రాశివారు ఈ ఏడాది సొంత ఇల్లు, సొంత వాహనంతో పాటు, స్థలాలు, పొలాలను సంపాదించుకోవడం మీద కూడా దృష్టి పెడతారు. ఇందుకు అవసరమైన ఆదాయాన్ని పెంచుకోవడానికి తమకు అంది వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. గురు, శుక్ర గ్రహాల బలానికి, రాశ్యధిపతి కుజుడి బలం కూడా తోడ వుతున్నందువల్ల వీరు తప్పకుండా కొద్ది కాలంలో చాలావరకు తమ ఆశలను నెరవేర్చుకుంటారు.
వృషభం: ఆర్థిక భద్రత, కుటుంబ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఈ రాశివారు ఈ ఏడాది తప్పకుండా భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఈ రాశివారు వాహనం మీద కంటే సొంత ఇంటి మీద ఎక్కు వగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఒక పక్క ఆదాయ వృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తూనే మరో పక్క సొంత ఇంటి కొనుగోలు మీద శ్రద్ధ పెడతారు. ధన కారకుడు గురువు, రాశ్యధిపతి శుక్రుడి అనుకూలత వల్ల ఈ ఏడాది వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి మనుసులోని కోరిక నెరవేరే అవకాశం ఉంది.
సింహం: ఈ రాశివారికి సొంత ఇంటి మీద ఉన్నంత ప్రేమ అద్దె ఇంటి మీద ఉండదు. పరాధీనత వీరికి నచ్చని విషయం. ఈ ఏడాది వీరికి ధన కారకుడైన గురువు లాభ స్థాన సంచారం వల్ల సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ను వృద్ధి చేసుకోవడం ప్రధాన లక్ష్యాలుగా మార తాయి. ఆర్థిక భద్రత కోసం స్థలాలు, భూములను సంపాదించు కునే అవకాశం కూడా ఉంది. లక్ష్య సాధన కోసం వీరు తీసుకునే రిస్కు, వీరు పడే శ్రమ ఈ ఏడాది తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.
కన్య: లక్ష్య సాధన కోసం ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడంలో వీరిని మించిన వారు లేరు. వృత్తి, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడాలన్నది వీరి గట్టి నమ్మకం. కొద్దిగా ఎక్కువగా శ్రమపడైనా వీరు ఆదాయాన్ని పెంచుకుని, సొంత ఇంటితో పాటు ఆస్తిని సంపాదించుకునే అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడితో పాటు, గురు, శుక్రులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు స్థలాలు, పొలాల మీద పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
వృశ్చికం: ఈ రాశివారికి ఆదాయ వృద్ధితో పాటు, స్థలాలు, పొలాలు సంపాదించుకోవడం మీద ఈ రాశివారికి మమకారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. సొంత ఇల్లు కలిగి ఉండడమనేది వీరికి ప్రధమ ప్రాధాన్యం అవుతుంది. రాశ్యదిపతి కుజుడు ఈ ఏడాదంతా బాగా అనుకూలంగా ఉండబోతున్నందు వల్ల వీరికి తప్పకుండా భూలాభం కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి కోసం వీరు చేసే ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ప్రతి ఆదాయ మార్గాన్నీ వీరు సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది.
మకరం: ఈ రాశివారు పట్టుదలకు మారుపేరుగా ఉంటారు. మనసులో ఏదైనా కోరిక కలిగితే అది నెరవేరే వరకూ విడిచిపెట్టడం జరగదు. ఈ ఏడాది ఈ రాశివారికి రాశ్యధిపతి శనీశ్వరుడు ‘వృద్ది’ స్థానమైన తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరు పట్టువదలని విక్రమార్కుల్లా సొంత ఇంటినే కాదు, అనేక విధాలుగా పురోగతిని, అభివృద్ధిని సాధించుకునే అవకాశం ఉంది. ఏ రిస్కు తీసుకున్నా, ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆదాయ మార్గాల్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు.