
రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే.. భారత్ 6-8 శాతం ఆర్థిక వృద్ధి రేటును అందుకోగలదని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన దేశం ఆర్ధిక వృద్దిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక ప్రణాళికలో సమగ్రాభివృద్ది కీలక పాత్ర పోషిస్తుందని.. నూతన తయారీలు, చట్టాల సరళీకరణపై కూడా తమ ప్రభుత్వం నిరంతర దృష్టి సాధిస్తుందన్నారు కేంద్రమంత్రి.
దేశంలో ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టడానికి, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి సమగ్రాభివృద్ది కీలకంగా మారిందని.. ప్రతీ వర్గానికి చెందిన ప్రజలకు ఆర్ధిక ప్రయోజనాలు అందేలా ఆయన ఎలప్పుడూ పర్యవేక్షించారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశ యువతలో ఎనలేని ప్రతిభ ఉందని.. ప్రతీ రంగంలోనూ అసమానమైన ప్రతిభావంతులు ఉన్నారన్నారాయన. ఇందుకే ప్రపంచమంతా భారత్ ఆచరిస్తోన్న పాలసీలపై ఓ కన్నేసి ఉంచిందన్నారు. ప్రపంచంలోని పేరున్న కంపెనీలు తమ ఫ్యాక్టరీలు, వాల్యూ చైన్లను భారత్కు తరలి వస్తున్నాయని చెప్పారు. కాగా, సుంకాలు తగ్గించడం, కస్టమ్స్ చట్టాలను సరళీకృతం చేయడం.. ఎగుమతి, దిగుమతుల ద్వారా వచ్చే వృద్ది లాంటివి అంశాలు దేశ ఆర్ధిక వృద్దిలో కీలక పాత్రలు పోషిస్తున్నాయని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.