
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు భీభత్సమైన ఎండలు జనాలను ఉక్కిరిబిక్కి చేస్తుంటే… అంతలోనే వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అప్పుడప్పుడు ఈదురుగాలుతో కూడిన వడగళ్ల వానలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని ఉందంటోంది వాతావరణ శాఖ. అలాగే పగటి ఉష్ణోగ్రతలు సైతం ఏమాత్రం తగ్గవంటోంది. 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.
ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం మరికొన్ని రోజులపాటు ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండలు ఎండలే… వానలు వానలే అని చెబుతున్నారు. రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి