
బుధవారం(మార్చి 12) కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు.. పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు.. శ్రీకాకుళం జిల్లా బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరామండలం, విజయనగరం జిల్లా బొబ్బివి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు(19) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
బుధవారం(మార్చి 12) వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(180):
శ్రీకాకుళం జిల్లా-18, విజయనగరం-21,పార్వతీపురం మన్యం-3, అల్లూరి సీతారామరాజు-12, అనకాపల్లి-13, కాకినాడ-18, కోనసీమ-11, తూర్పుగోదావరి-19,పశ్చిమగోదావరి-4, ఏలూరు-16, కృష్ణా-10, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. గురువారం 53 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 39°C, పార్వతీపురంమన్యం జిల్లా కురుపాంలో 39°C, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 38.7°C, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో 38.7°C, విజయనగరం జిల్లా నెలివాడలో 38.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచయన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో వానలు..
తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జోరున వానలు పడుతున్నాయి. ఇప్పటికే చెన్నైతో పాటు 12 జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావంతోనే తమిళనాడు, ఏపీలోని రాయలసీమలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.