
పొలాలకు నీళ్లు కావాలన్నా, ఇంటి అవసరాలకు నీరు కావాలన్నా బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. అయితే బోరు వేసిన ప్రతిచోటా, ప్రతిసారీ నీరు పడుతుందా అంటే చెప్పలేం. బోరు వెయ్యగానే నీరుపడింది అంటే అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే రాను రానూ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయనే హెచ్చరికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు పడటం కొంచెం కష్టమే. అయితే ఓ రైతు నీటి కోసం 10 సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. అయినా ఎక్కడో ఆశ అతన్ని మరోసారి ప్రయత్నించేలా చేసింది. ఎట్టకేలకు గంగమ్మ కరుణించింది. మోటారు వేయకుండానే సహజసిద్ధంగా పాతాళ గంగమ్మ ఉబికి వస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా, ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ, పాలేనివారి పల్లిలో రైతు గంగరాజు పొలంలో బోరుబావి ఎండిపోయింది. లక్షలు ఖర్చుపెట్టి 10సార్లు బోర్లు వేయించాడు రైతు. చివరికి అప్పల పాలైపోయాడు. అయినా అతనిలో ఆశ చావలేవు. చివరిగా మరోసారి ప్రయత్నిద్దామని పదకొండోసారి బోరు వేయించాడు. వెయ్యి అడుగుల్లో బోరువేసిన నీళ్లు పడని ఈ రోజుల్లో బోరు వేయగానే పాతాళగంగ ఉప్పొంగింది. మోటారు ఆన్ చేయకుండానే నీళ్లు బోరుబావిలో పొంగి పొంగిపొర్లుతున్నాయి. గంగరాజు తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసుకునేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాడు. చివరకు అప్పు చేసి బోరు వేయించాడు. ఒక్కసారిగా నీరు ఉబికి రావడంతో గంగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్లకు గంగమ్మ కరుణించిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆనందంతో గంగమ్మకు పూజలు చేశాడు. గంగరాజు కష్టం ఫలించి బోరుబావిలో నీళ్లు పడటంతో ఇతర రైతులు సైతం హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి