
అనకాపల్లి జిల్లాలో బాణసంచా పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కోటవురట్ల పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించగా..పరిమితికి మించి బాణసంచా ఉండడంతోనే భారీ పేలుడు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 2012 నుంచి ఈ బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తుండగా..నిన్న జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.15లక్షల పరిహారం ప్రకటించారు. ఆటు ప్రధాని మోదీ కూడా రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ పేరుతో 2012 నుంచి ఈ బాణా సంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తాతబాబుకు చెందిన స్థలంలో ఆయన పేరుతోనే ఈ బాణ సంచా తయారీ కేంద్రం నడుస్తోంది. తాతబాబు తోడల్లుడు జానకిరామ్ ఈ బాణాసంచా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో తాతబాబు, అతని మామ బాబురావు మృతి చెందగా జానకీరామ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నప్పటికీ, మంటలు ఎగిసి పడుతుండటం, మధ్యమధ్య పేలుళ్లు సంభవిస్తుండటంతో సాహసించి ముందుకు వెళ్లలేకపోయారు చివరకు కొందరు ధైర్యం చేసుకుని వెళ్లి కొన ఊపిరితో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మందుగుండును మిశ్రమంగా మలిచేందుకు కర్రతో కొడుతుండగా మంటలు చెలరేగినట్లు క్షతగాత్రులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…