
అమరావతి, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ఇటీవల ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రత్యేక వేసవి కోచింగ్ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారాలతో సహా అన్ని రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదర్శ పాఠశాలలకు అనుసంధానమైన కేజీబీవీ టైప్ 4 వసతిగృహాలను కొనసాగించాలని తెలిపారు. ఆదర్శ పాఠశాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 66 శాతం, ద్వితీయ సంవత్సరంలో 82 శాతం ఈ ఏడాది ఉత్తీర్ణత నమోదైంది.
కాగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య జూన్ 6న నిర్వహించనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 టైం టేబుల్ ఇదే..
ఇవి కూడా చదవండి
ఎంట్రెన్స్ లేకుండానే తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్లు.. టెన్త్ మెరిట్ ఆధారంగా సీట్లు
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష, ఎలాంటి ఫీజు లేకుండానే అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. దీంతో అన్ని గురుకుల కాలేజీల్లో ప్రవేశానికి ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 268 ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలుండగా.. వీటిల్లో 20వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 శాతం ఎస్సీ గురుకులాల్లో టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 50 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలలు, ఇతర స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులకు కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.