
అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలకు రూట్ క్లియర్ అవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన సర్కార్.. రాజప్రతిని గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించారు. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెడితే ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తైనట్లే. ఆ మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే డీఎస్సీ దరఖాస్తు విధానంలో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ, బీ విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమశాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బీలో సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం డీఎస్సీ ఫలితాలు వెడువడిన తర్వాత చేస్తారు. కానీ నియామక విధానం వేగవంతం చేసేందుకు కూటమి సర్కార్ అభ్యర్ధుల నుంచి ముందుగానే పూర్తి వివరాలను సేకరిస్తుంది.
దీంతో పదో తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు. ఇలా చేస్తే న్యాయవివాదాలు లేకుండా ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్‌కు కొత్తగా మంజూరు చేసిన 2,260 ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను మెగా డీఎస్సీలో కలపడం లేదు. ఈ పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డీఎస్సీలో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
డీఎస్సీ ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం కేటాయించనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే డీఎస్సీ పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేయనున్నారు. అంటే విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారన్నమాట. అవసరం లేని చోట పోస్టులను తొలగించి, పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకుని బదిలీలు, సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన టీచర్ పోస్టులను కూడా డీఎస్సీ పోస్టుల్లో కలపనున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.