
అమరావతి, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల 20వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ పోస్టులు ఉండటంతో పోటీ తీవ్రత కూడా అదే స్థాయిలో ఉండనుంది. మొత్తం ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులుండగా.. రాష్ట్ర, జోనల్ స్థాయుల్లో 2259 వరకు కొలువులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ ఉద్యోగాలు 6599 ఉంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7487 ఉన్నాయి. ఇవికాకుండా వ్యాయామ టీచర్, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి. అన్ని పోస్టులకు అంటే టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్‌లో అర్హత తప్పనిసరి. ఈ పోస్టులకు టెట్‌లో వెయిటేజి 20 శాతం ఉంటుంది.
కానీ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు మాత్రం టెట్ అవసరం లేదు. ఈ మూడు రకాల పోస్టులకు పేపర్ 1 గా ఇంగ్లిష్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారన్నమాట. బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు అనర్హులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2678 పోస్టులున్నాయి. 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంటే డీఎస్సీ 80 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర (1/2)మార్కు కేటాయిస్తారు. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ జరుగుతాయి.
ఏపీ డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 15, 2025గా నిర్ణయించారు. అప్పటి వరకు అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశ ఉంటుంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఎడ్, డీఎడ్, డీఈఈడీతోపాటు ఏపీటెట్/సీటెట్ స్కోరు సాధించిన వారు ఎవరైనా డీఎస్సీ పోస్టులకు పోటీ పడవచ్చు. దరఖాస్తు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.750 ఉంటుంది. అంటే ఎన్ని పేపర్లకు దరఖాస్తు చేస్తే అన్నిసార్లు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
డీఎస్సీలో టెట్ స్కోర్ ఎలా లెక్కిస్తారంటే..
టెట్ మొత్తం మార్కులు 150. అందులో మీకు సాధించినవి 120 వచ్చాయనుకోండి. ఇప్పుడు 20 శాతానికి ఈ మార్కులను లెక్కించాలంటే.. సాధించిన మార్కులు/ మొత్తం మార్కులు × 20 వెయిటేజితో లెక్కించాలి. అంటే 120/150X20 = 16 మార్కులన్నమాట. అదే టెట్ మార్కులు130 వచ్చాయంటే 17.3 వెయిటేజీ మార్కులు వచ్చినట్లు లెక్క. వీటికి డీఎస్సీలో వచ్చిన మార్కులను లెక్కిస్తే డీఎస్సీ స్కోర్ వచ్చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్ చేయండి.