
అమరావతి, మార్చి 30: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీతో పరీక్షలు ముగియనుండగా.. ఆరోజు రంజాన్ పండగ సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రోజు జరగవల్సిన సాంఘిక శాస్త్రం పబ్లిక్ పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మార్చి 31న రంజాన్ పండుగ సందర్భంగా సెలవు నేపథ్యంలో సాంఘిక శాస్త్రం పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మారిన పరీక్ష తేదీని అన్ని విభాగాలకు తెలియజేయాలని వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు ఆయన సూచించారు. ఇక మార్చి 28న జరిగిన జీవశాస్త్రం పరీక్షలో చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్థి కాఫీ కొడుతూ పట్టుబడగా.. ఆ విద్యార్ధిని అధికారులు డిబార్ చేశారు. ఇన్విజిలేటర్‌ను సైతం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 3 నుంచి 7 వరకు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఆయా రోజుల్లో రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తారు. మూల్యాంకనం చేసిన పత్రాల పునఃపరిశీలనలో మార్కుల తేడాలు వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతోపాటు జరిమానా విధిస్తామని, కేంద్రాల్లో సెల్ఫోన్లను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఇక పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ నెల చివరి నాటికి వెలువరించే అవకాశం ఉంది.
ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. ఈ మేరకు కార్యదర్శి మస్తానయ్య ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.