
ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 2022లో జరిగిన ఒక భయంకరమైన కారు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ తన భాదను బయట పెట్టాడు. BBC ప్రసిద్ధ ఆటోమొబైల్ షో అయిన “టాప్ గేర్” కోసం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌లో చిత్రీకరణ జరుగుతుండగా, ఫ్లింటాఫ్ నడుపుతున్న ఓ త్రీ-వీలర్ వాహనం (మోర్గాన్ సూపర్ 3) అకస్మాత్తుగా అదుపు తప్పి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతనికి ముఖానికి, పక్కటెముకలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖం తెగిపోయిందని అనిపించే స్థాయిలో గాయాలు కావడంతో, ఫ్లింటాఫ్‌కు శస్త్రచికిత్స అవసరమైంది. ఈ సంఘటన అనంతరం BBC షో నిర్మాణాన్ని నిలిపివేసి, మాజీ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు £9 మిలియన్ పౌండ్ల పరిహారం చెల్లించబడింది.
ఇప్పుడు డిస్నీ+ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ, ఫ్లింటాఫ్ ఆ సంఘటన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. “నేను చనిపోయానని అనుకున్నాను. నేను స్పృహలో ఉన్నాను కానీ నాకు ఏమీ కనిపించలేదు. అంతేనా నా జీవితం? మిగతా రోజుల్లో నాకు వెలుగు లేకుండాపోతుందా అనిపించింది. నా టోపీ నా కళ్లమీద పడిపోయింది. ఆ టోపీని పైకి లాగి చూసే సరికి నేను ఇంకా బ్రతికే ఉన్నాను, కానీ టాప్ గియర్ ట్రాక్‌లో ఉన్నాను, ఇది స్వర్గం కాదు,” అని అన్నాడు.
ఆ సంఘటనలో అతనికి చాలా భయం వేసిందని, ముఖం పూర్తిగా పాడైపోయిందని అనిపించిందని ఫ్లింటాఫ్ చెప్పాడు. “నా ముఖం ఊడిపోయిందని అనిపించింది, నేను చనిపోతానని భయపడ్డాను అని చెప్పాడు. “నేలపై పడినపుడు తల తీవ్రంగా దెబ్బతింది. కారు పక్కకు వెళ్లింది, నేను కారు వెనుకభాగం మీదుగా వెళ్ళాను, ఆపై దాదాపు 50 మీటర్ల దూరంలో కారు కింద రన్‌వేపై పడిపోయాను,” అని చెప్పాడు.
ఆ ప్రమాదం తరువాత ఫ్లింటాఫ్‌కు చికిత్స చేసిన సర్జన్ డాక్టర్ జహ్రాద్ హక్ మాట్లాడుతూ, ఆయన గాయాలు క్లిష్టమైనవని వివరించారు. “అతను తన పై పెదవిలో చాలా ముఖ్యమైన భాగాన్ని, చర్మం, కండరాలను కోల్పోయాడు. కింది పెదవి కూడా దెబ్బతింది,” అని అన్నారు.
ఈ భయంకరమైన సంఘటన తర్వాత, ఆ బాధను తట్టుకోగల శక్తి తనకు లేదని ఫ్లింటాఫ్ అభిప్రాయపడ్డాడు. “ఇది భయంగా అనిపించింది. కొంత భాగం నాలో చనిపోయి ఉంటే బాగుండేదని అనిపించింది. కానీ నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు. అలాంటి భావనలకు నేను అర్థం మార్చుకోవద్దని కోరుకుంటున్నాను. కానీ అప్పట్లో అదే సులభమైన మార్గంగా అనిపించింది,” అని భావోద్వేగంగా తెలిపారు.
అయితే ఇప్పుడు జీవితం పట్ల ఆశతో చూస్తున్నానని, “రేపు సూర్యుడు ఉదయిస్తాడు, నా పిల్లలు నన్ను కౌగిలించుకుంటారు. ఇప్పుడు నేను మంచి స్థానంలో ఉన్నాను” అని ఫ్లింటాఫ్ తుదకు చెప్పడం ఆ మనోబలానికి నిదర్శనంగా నిలుస్తోంది. అతని జీవితానికి మిగిలిన పేజీలు ఇంకా ఆశతో, శక్తితో, స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..