అందరికీ బోగిమంటలతో సంక్రాంతి మొదలైతే, కోనసీమ, పల్నాడు, క్రిష్ణా జిల్లా ఇంక్లూడింగ్ రాయలసీమ.. ఇక్కడంతా కోళ్ల పందేలతోనే పెద్ద పండగ తొలిరోజు తెల్లారింది. ఊరు, వాడ ఎటు చూసినా కోడి పందేల బరులదే హవా. మూడు రోజుల పాటు జరిగే కాయ్ రాజా కాయ్… తొలిరోజు భారీ కలెక్షన్లతో సూపర్‌హిట్టు కొట్టింది.
రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, ఆత్రేయపురం, రాజోలు, మురమళ్ల, ముమ్మిడివరం, కాకినాడ.. ఎటుచూసినా కోడి పందేలదే జోరు. వీరవాసరం మండలం నవుడూరు మహిళలు ఆడిన కోడిపందాలు ఇంకా స్పెషల్. పిఠాపురంలో ఐతే, మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగానే షురూ ఐంది కాయ్ రాజా కాయ్. ఏలూరు జిల్లా రామానుజపురంలో కోడి పందాల బరిలో దిగి సాక్షాత్తూ పోలవరం ఎమ్మెల్యేనే సందడి చేశారు. పందెం రాయుళ్లకు బూస్ట్‌నిచ్చారు. పైగా, ఇది సంస్కృతిలో ఒక భాగమని సర్టిఫై చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం కోడిపందేలైతే ఇంకాఇంకా కలర్‌ఫుల్. డిప్యూటీ స్పీకర్ రఘురాంకృష్ణంరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి కోళ్లకు కయ్యం పెట్టారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనల్నెవడ్రా ఆపేది రేంజ్లో జరిగాయి కోడి పందేలు. రామవరప్పాడులో 70 ఎకరాల్లో భారీ స్థాయిలో ఏర్పాటయ్యాయి బరులు. LED స్క్రీన్లు, లేడీ బౌన్సర్లు.. గెలిచినవాళ్లకు భారీ నజరానాలు… ఓ జాతరలా సాగుతోంది అక్కడ పందెంరాయుళ్ల జోరు. పెద్దపెద్ద వీఐపీలే బరిలో దిగి పందెం కాశారు. కొన్నిచోట్లయితే, కోడి పందేల బరుల దగ్గర మద్యం పరవళ్లు, మాంసాహార విందులు.. ఇలా లెక్కలేనన్ని ఎగస్ట్రాలు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రుళ్లు కూడా కంటిన్యూ అయ్యాయి కోడి పందేలు.
పశ్చిమగోదావరిజిల్లా వ్యాప్తంగా అత్యధికంగా భోగి రోజు 500 కోట్లు చేతులు మారాయి. తూర్పు గోదావరి జిల్లాలో గుండాట, కోడిపందాలతో మొదటి రోజు 25 నుండి 30 కోట్లు, కోనసీమ జిల్లాలో 20నుండి 30 కోట్లు, కాకినాడ జిల్లాలోనూ అదే స్థాయిలో కనిపించింది కోడిపందేల టర్నోవర్. మొదటిసారి రాయలసీమలో కూడా కనిపించింది కోడిపందేల సంప్రదాయం. పులివెందులలో 80 లక్షలు, ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో 80 లక్షలు, వేంపల్లిలో 40 లక్షలు.. టోటల్‌గా రెండు కోట్లు దాటింది కడప జిల్లాలో పందెంరాయుళ్ల కలెక్షన్లు.
కోళ్లకు కత్తుల్లేకుండా పందెం ఆడాలన్నది సుప్రీంకోర్టు నిబంధన. అందుకే, చట్టవిరుద్ధంగా జరిగే కోడి పందేలపై ఎప్పటిలాగే ఉక్కుపాదం మోపారు పోలీసులు. కానీ, వర్కవుటైన దాఖలాలే లేవక్కడ. ముందస్తుగా కొన్నిచోట్ల బరుల్ని ధ్వంసం చేసి మమ అనిపించారు, తర్వాత అంతా షరా మామూలే. తిరువూరు, జగ్గయ్యపేట సహా కొన్నిచోట్ల బరులను తొలగించినా, భోగిరోజు ఉదయం కోడిపందాలు యధావిధిగా జరిగాయి. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే కోడి పందాల్లో పాల్గొన్నా.. పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఉన్నా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. సో, గెలుపు ఖాకీలది కాదు, కోడి పుంజులదే అన్నమాట.
