
గుడికి వెళ్తే దేవుడిని దర్శించుకునే ముందు.. ఆలయం చుట్టూ భక్తిశ్రద్దలతో ప్రదక్షిణలు చేస్తాం. ఇది సర్వసాధారణంగా పాటించే నియమం. అయితే గత కొంత కాలంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న జంతువులు, పక్షులకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. వీడియోలు చూస్తూనే ఉన్నాం.. అంతేకాదు ఒకొక్కసారి వానరం, పాము, ఎలుగుబంటి వి గర్భ గుడిలో దైవం దగ్గర పూజలు చేస్తున్నట్లు కూడా కొన్ని రకాల వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షం అవుతాయి. వీటిని చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనై ఇదంతా భగవంతుని మహత్యంగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ జంతువు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన జంతువు ఏమిటి అని వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏలూరు జిల్లా నిడమర్రు మండల కేంద్రమైన నిడమర్రులో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆలయానికి ప్రతిరోజు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులు సమర్పిస్తారు. అయితే ఈనెల 24వ తేదీ సోమవారం తెల్లవారుజామున ఆలయానికి ఒక ఆవు వచ్చింది. ఆవు ఆలయం ముందు నుంచి నడుస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. అలా కాసేపు ప్రదక్షిణలు చేసిన తరువాత ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నిలబడింది. ద్వారం వద్ద నుండి స్వామి వారి మూలవిరాట్ను ఈ తీక్షణంగా చూస్తూ స్వామివారిని దర్శించుకుంది.
అలా కాసేపు స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం స్వామివారిని దర్శించిన ఆ గోమాతను చూసిన భక్తులు, స్థానికులు ముందుగా ఆశ్చర్యానికి లోనయ్యారు.. ఆ తర్వాత ఇదంతా భగవంతుని మహిమ గా చెప్పుకుంటూ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఏలూరు జిల్లాలో వైరల్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..