
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి నియమితులైంది. స్థానికంగా అమరావతి కే చెందిన వైష్ణవి ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి అమరావతి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నందుకు సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
అమరావతికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన వైష్ణవి
అత్యంత చిన్న వయస్సులోనే అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వైష్ణవి, రాజధానికి నిధుల సమీకరణలోనూ కీలక పాత్ర పోషించారు. గతంలోనే రూ. 50 లక్షలు విరాళంగా అందించిన ఆమె, అమరావతి నిర్మాణం కోసం మరింత విరాళాలు సమీకరించాలనే సంకల్పాన్ని సీఎం ముందు వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
వైష్ణవి యువతకు ఆదర్శం అన్న సీఎం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, “రాష్ట్రాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలి. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతీ యువకులలో సేవా స్పూర్తి పెంపొందేలా ప్రోత్సహించాలి. అంబుల వైష్ణవి లాంటి యువతీ యువకులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలి” అని సూచించారు.
అమరావతి అభివృద్ధికి విస్తృత ప్రచారం చేస్తానంటున్న వైష్ణవి
అమరావతి రాజధాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైష్ణవి తనవంతు కృషి చేయాలని సీఎం సూచించారు. రాజధాని నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలను విస్తృతంగా ప్రచారం చేసి, అందరి మద్దతు పొందేలా పనిచేయాలని అన్నారు.
సీఎం అభినందనలు – వైష్ణవి స్పందన
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె సేవాభావానికి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ, “అమరావతి అభివృద్ధి నా కల. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేకరించేందుకు నా వంతు కృషి చేస్తాను” అని తెలిపింది.
అమరావతి భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంబుల వైష్ణవి, ఆమె సామాజిక సేవాభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..