
నెల్లూరు, మార్చి 13: ఓ కేటుగాడు ఏకంగా ఎస్సై పోస్టుకే ఎసరు పెట్టాడు. దర్జాగా యూనీఫాం కొనేసి.. వాటిని ధరించి కొత్త చెక్ పోస్టుల వద్ద మకాం పెట్టేశాడు. వాహనదారులను ఆపి అందినకాడికి దండుకోవడం చేస్తున్న సదరు ఎస్సై వాలకాన్ని చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు యవ్వారం బయటపడింది. నెల్లూరు జిల్లా సంగంలో ఈ నకిలీ ఎస్సై వ్యవహారం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
సంగంలో ఈ నకిలీ ఎస్సైగా చెలామణి అవుతూ తిరుగుతున్న హరీష్ అనే వ్యక్తిని సంగం పోలీస్‌లు అరెస్ట్ చేశారు. సంగం పోలీస్ స్టేషన్లో నకిలీ ఎస్సై అరెస్ట్ గురించి ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సంగం కొత్త చెక్ పోస్ట్ వద్ద నకిలీ ఎస్సైగా వేషధారణ ధరించి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. ముద్దాయి నుండి కారు, నకిలీ యూనిఫాం, బెల్ట్, సింహాలు, బూట్లు, నేం ప్లేట్, టోపీ, నక్షత్రాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
సిద్ధీపురంకి చెందిన హరీష్ అనే వ్యక్తి 2023లో వచ్చిన ఎస్సై ఫలితాల్లో సెలెక్ట్ అయ్యానని నమ్మించి.. నకిలీ ఎస్సై వేషధారణ వేసి మోసం చేస్తూ తిరుగుతున్నాడని తెలిపారు.
సైజుకు తగ్గట్టు ఎస్సై యూనిఫాంలు కుట్టించుకుని బెల్ట్, సింహాలు, బూట్లు, నేం ప్లేట్, టోపీ, నక్షత్రాలు తయారుచేయించుకుని నకిలీ ఎస్సై గా చెలామణి అవుతూ పలు ప్రాంతాలలో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు. డిజిటల్ అరెస్ట్ లను ఎవరూ నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, ఇతర సిబ్బందిని అభినందించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.