
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను దగ్గర నుండి చూడాలని ఓ క్యాన్సర్ పెషేంట్ కోరిక. దీంతో వీడియో కాల్ చేసిన హోంమంత్రి ఆమెతో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ఎప్పుడు మాట్లాడాలనిపించినా కాల్ చేయాలని ఆమెకు భరోసా ఇచ్చారు. అంతే కాదు.. ధైర్యానికి మించిన మందు లేదని ఆమెలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు.
శ్రీకాకుళంకు చెందిన లతశ్రీ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ఇటీవల తరచూ టీవీల్లో రాష్ట్ర హోంమంత్రి అనితను చూసేవారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ.. పలు సభలు వేదికలపై హోంమంత్రి మాట్లాడిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో హోంమంత్రిని దగ్గర నుండి చూడాలని ఉందని లతశ్రీ.. తన భర్త ఆనంద్కు తెలిపారు. ఆనంద్ తన సన్నిహితుల ద్వారా ఆ సమాచారాన్ని హోంమంత్రి అనితకు తెలియజేశారు. దీంతో చలించిన హోంమంత్రి అనిత.. స్వయంగా లతశ్రీతో వీడియో కాల్లో మాట్లాడారు.
ధైర్యాన్ని మించిన మెడిసన్ లేదని లతశ్రీకు హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా తిరిగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, త్వరలోనే శ్రీకాకుళం వచ్చి కలుస్తానని లతశ్రీ తో చెప్పారు హోం మంత్రి. ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే తనకు ఫోన్ చెయ్యాలని చెబుతూ లతశ్రీకి హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. లతశ్రీ కుటుంబసభ్యులతోనూ హోం మంత్రి మాట్లాడారు. హోంమంత్రి నేరుగా వీడియో కాల్ చేయడంతో లతశ్రీ ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..