నెల్లూరు, జనవరి 17: పండగ పూట ఘోర విషాదం చోటు చేసుకుంది. కనుమ పండగ రోజు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్ధులు అలలకు కొట్టుకు పోయారు. మొత్తం ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో శుక్రవారం (జనవరి 16) జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని అల్లూరు మండలం బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు. అల్లూరు మండల నార్త్‌ఆములూరు పంచాయతీ గోళ్లపాళెం చైల్డ్ ఆశ్రమంలో వీళ్లిద్దరూ చదువుతున్నారు. వీరి బంధువులు అల్లూరు యర్రపగుంటలో ఉన్నారు. దీంతో సంక్రాంతి పండగ కావడంతో బంధువుల ఇంటికి వచ్చారు. అయితే శుక్రవారం కనుమ పండగ కావడంతో ఈ ఇద్దరు అన్నా చెల్లెల్లతోపాటు మరో నలుగురు స్నేహితులు కె అభిషేక్ (16), జి సుదీర్ (15), ఈగ చిన్నబయ్య, ఎస్ వెంకటేష్‌తో కలిసి ఇసుకపల్లి సముద్రం బీచ్‌కు వెళ్లారు.
వీరు తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా రాకాసి అలలు వచ్చాయి. దీంతో ఆ పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె అభిషేక్, జి సుదీర్ అలల్లో గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోవడంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అనంతరం స్థానికంగా ఉన్న మత్స్యకారులకు ఈ సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటికి ఈగ అమ్ములు మృతదేహం ఒడ్డుకు వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి బాలకృష్ణ మృతదేహం కూడా కనుగొన్నారు. అభిషేక్, సుదీర్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్ల గాలిస్తున్నారు. ఇంకా గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
