
చిత్తూరులో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. హత్యనా..? లేక ఆత్మహత్యనా? అన్న దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఒకరేమో ఆత్మహత్య, మరొకరి వాదనేమో హత్య అసలు ఏమి జరిగిందన్న దానిపై పోలీసులు నోరు మెదపకపోవడంతో సస్పెన్స్‌కు కారణమైంది. చిత్తూరులో పరువు హత్య జరిగిందన్న చర్చ కూడా నడుస్తోంది.
యాస్మిన్ భాను, సాయితేజ ఇద్దరూ ప్రేమించుకున్నారు. చిత్తూరులో బీటెక్ చేసిన సాయి తేజ, ఎంబీఏ చేసిన యాస్మిన్ భాను ఇద్దరూ 4 ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2 నెలల క్రితం పెళ్లి చూసుకున్నారు. ఇదంతా బాగుంది. కట్ చేస్తే, ఆదివారం(ఏప్రిల్ 13) యాష్మిన్ భాను అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చిత్తూరులోని మసీదు మిట్టలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
చిత్తూరుకు చెందిన యాస్మిన్ భానును గత ఫిబ్రవరిలో పూతలపట్టు మండలం పోటు కనుమకు చెందిన సాయి తేజ నెల్లూరులో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మతాలు, కులాలు వేరు కావడంతో యాష్మిన్ భాను కుటుంబానికి ఈ పెళ్లి ఇష్టం లేకపోయింది. అయితే ఇద్దరి మధ్య 4 ఏళ్లుగా నడిచిన ప్రేమ వ్యవహారం గత ఫిబ్రవరి 9న నెల్లూరులో జరిగిన పెళ్లితో ఒక్కటి చేసింది. ఫిబ్రవరి 13న రక్షణ కోసం ప్రేమ జంట తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
యాస్మిన్ భాను ను సాయితేజ వెంట పంపారు.
ఇప్పటిదాకా కథ సుఖాంతంగానే జరిగిన ఆదివారం తండ్రికి సీరియస్‌గా ఉందని యాస్మిన్ భానును ఇంటికి పిలిపించడం,
ఆ వెంటనే యాస్మిన్ భాను మృతి చెందినట్లు సాయి తేజకు సమాచారం రావడంతో కథ అడ్డం తిరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి రెండు నెలలకు పైగా యాస్మిన్ భాను తల్లిదండ్రులకు దూరంగానే ఉండగా ఆదివారం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలకలం రేపుతోంది.
యాస్మిన్ భానును ఆదివారం ఉదయం 11 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ సర్కిల్‌కు కారులో తీసుకెళ్లిన సాయి తేజ అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న యాస్మిన్ భాను అన్న లాలుకు దగ్గరికి పంపాడు. అక్కడి నుంచి అన్న లాలు తీసుకొచ్చిన కారులో వెళ్లిపోయిన యాస్మిన్ భాను ఇక తిరిగి రాలేకపోయింది. ఆరోగ్యం బాగాలేని తండ్రిని పరామర్శించిన తర్వాత తిరిగి తన వెంట తీసుకు వెళ్లేందుకు పీసీఆర్ సర్కిల్ వద్దే దాదాపు గంటపాటు వెయిట్ చేసిన సాయి తేజకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో నేరుగా యాస్మిన్ భాను ఇంటికి వెళ్ళాడు. యాస్మిన్ భాను ఎక్కడని ఆరా తీస్తే, సరైన సమాధానం రాకపోగా చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే మార్చురీలో ఉందన్న సమాధానం వచ్చింది. గంట క్రితం వరకు బాగా ఉన్న యాస్మిన్ భాను తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన అరగంటలోనే మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు సాయి తేజ.
తన భార్యను తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపించాడు సాయి తేజ. యాష్మిన్ భానుది ముమ్మాటికీ మర్డర్ అంటున్నాడు.
తమ మధ్య ఎలాంటి గొడవలు లేవనీ, యాష్మిన్ భాను ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదంటున్న సాయి తేజ అన్ని విషయాలు పోలీసులకు చెప్పామంటున్నారు. కులాలు మతాలు వేరుకావడంతోనే హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. యాష్మిన్ భానును ఇంటికి వెళ్లిన అరగంటలోనే హతమార్చారని సాయి తేజ ఆరోపిస్తున్నారు.
మరోవైపు యాస్మిన్ భాను మృతిపై తల్లి ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంబీఏ పూర్తి చేసిన యాస్మిన్ భానుకు గత ఫిబ్రవరి 9న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని, అయితే ఫిబ్రవరి 6 నే యాస్మిన్ తన క్లాస్మేట్ అయిన సాయి తేజతో వెళ్లిపోయిందని ఆమె తల్లి ముంతాజ్ ఫిర్యాదులో పేర్కొంది. పూతలపట్టు మండలం పోటు కనుమకు చెందిన సాయి తేజను పెళ్లి తీసుకుందని పేర్కొంది. పెళ్లయిన 15 రోజుల తర్వాత సాయి తేజ ఇంటికి వెళ్లి పరువు తీసిన కూతుర్ని నిలదీసి ఇంటికి రమ్మని కోరామన్నారు. అయితే సమయం చూసి వస్తానని చెప్పిన యాస్మిన్ భాను చిత్తూరుకు వచ్చి ఇంటికి ఫోన్ చేసిందని, ఈ మేరకు యాస్మిన్ ను ఇంటికి తీసుకొచ్చామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ పరువు తీసిన యాస్మిన్ ను తిట్టి తండ్రి బయటికి వెళ్లిపోయాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని ముంతాజ్ ఫిర్యాదులో పేర్కొంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని చెబుతోంది.
ఇక కూతురు యాస్మిన్ భానుది ఆత్మహత్య అని తల్లి ఫిర్యాదు చేస్తే, యాస్మిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సాయి తేజ మర్డర్ అని ఆరోపిస్తుండడంతో పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో, పోలీసుల దర్యాప్తు ఏం తేల్చ బోతుందోనన్న చర్చ నడుస్తుంది..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..