
ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. అధికార, విపక్షాల మధ్య నాన్‌స్టాప్‌గా డైలాగులు పేలుతున్నాయి. రామగిరిలో మొదలైన రచ్చ రోజురోజుకు రాజుకుంటోంది. రాజకీయంగా సెగలు రాజేస్తోంది. చూస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీకి పాకేలా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్ టూర్ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ అయింది. దీంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లిపోయారు.
అయితే.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు సరైన సెక్యూరిటీ కల్పించడంలో అధికార కూటమి విఫలమైందంటూ విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సీపీఐ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతల విమర్శలను పట్టించుకోవాలని అధికార కూటమికి సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు.
జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందంటున్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. జగన్‌కి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. 1100 మంది పోలీసులతో రక్షణ కల్పించామని చెబుతున్నారని, అయితే హెలిపాడ్ దగ్గర వంద మంది పోలీసులు కూడా లేరన్నారు.
ఇక బొత్స కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.. వైసీపీ నేతలు డబ్బులు పంచిపెట్టి హెలికాప్టర్ దగ్గరకు జనసమీకరణ చేశారని ఆయన ఆరోపించారు.
హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను పెడితే , భద్రత లేదు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..