
రైలు క్రింద పడి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన.. తల్లిదండ్రులకు తీవ్ర కడుపుకోతను మిగిల్చింది. ఒకే గ్రామానికి చెందిన యువతీ, యువకుడు తమ ప్రేమ వ్యవహారంలో పెద్దలు అడ్డుపడతారన్న భయంతో అర్ధాంతరంగా తనువుచాలించారు. నిండా రెండు పదులు నిండని ఆ ప్రేమికుల తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడకు.. కూతురు మరణించడంతో.. ఆయా కుటుంబాల్లో శోకసంద్రంలో మునిగాయి..
ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్తపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తపాలెం గ్రామానికి చెందిన రాజు మణికంఠారెడ్డి (21), పక్కా జాహ్నవి (18) ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజు మణికంఠారెడ్డి ఒంగోలులో ఐటీఐ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. జాహ్నవి ఇంటర్మీడియట్ చదివి ఇంటవద్దనే ఉంటుంది.
ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరిది ఒకే కులం అయినా తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పే సాహసం చేయలేకపోయారు. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే మందలిస్తారనే భయంతో మంగళవారం కడవకుదురు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు..
మృతదేహాలు రైలు కింద పడి గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ ఎస్సై కొండయ్య, ఏఎస్సై శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం, ఆత్మహత్య ఘటనలు ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..