
ఎక్కడైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు బాధితులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. మరి పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే..? ఓర్నీ ఇదేంది..? అనుకుంటున్నారా..? అవును.. గాజువాక పోలీస్ స్టేషన్లో అది జరిగింది. రోడ్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన బుల్లెట్ ను పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు పోలీసులు.. అయితే.. కొన్ని రోజులకు ఆ బైక్ మాయమైంది. దీంతో పోలీసులే ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది.. ఈ షాకింగ్ ఘటన గాజువాక పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. వివిధ కేసుల్లో పట్టుబడ్డ టూ వీలర్లను గాజువాక పోలీసు స్టేషన్ ఆవరణలో ఉంచారు. ఇందులో భాగంగానే గత ఏడాది మే 3న గాజువాకలో రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి ఓ బుల్లెట్ ను పోలీసులు సీజ్ చేశారు. దాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. బుల్లెట్ యజమాని హరీశ్.. తన వాహనాన్ని ముఖేశ్ అనే వ్యక్తికి ఇచ్చాడు. దీంతో ముఖేష్.. రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. అప్పట్లో కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్లో ఉంచారు. అయితే.. బుల్లెట్ యజమాని.. హరీశ్ కోర్టు నుంచి అనుమతితో వాహనం తీసుకోవడానికి స్టేషన్ కెళ్లాడు. తన వాహనం ఇవ్వాలని అక్కడ పోలీసులకు అడిగాడు. బుల్లెట్ ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు.. దాన్ని పార్కింగ్ చేసిన చోటుకు వెళ్లి చూసారు. అక్కడ ఆ వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులే షాకయ్యారు.
దీంతో ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కేసుకు సంబంధించి స్కూటీ కూడా మాయమైనట్లు గుర్తించారు పోలీసులు. ఇది ఇంటి దొంగల పనా? లేక ఎవరైనా బయటి వ్యక్తులు దొంగలించారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ఆదేశించామని సి పి బాగ్చి అన్నారు..
కాగా.. పోలీస్ స్టేషన్లోనే బైక్ లు మాయమవ్వడం కలకలం రేపింది.. ఇదివరకు పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ఇప్పుడు ఉన్నాయో..? లేదో అని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..