
తన కామవాంఛను తీర్చలేదన్న కోపంతో ప్రియురాలిని చంపేసిన ప్రియుడు గురించి వినే ఉంటారు. బలత్కారం చేయబోతే బాధిత మహిళ ప్రతిఘటించిన సందర్భంలో ఆ మహిళను చంపేసిన రేపిస్టుల గురించి చదివే ఉంటారు. కానీ తాజాగా తన కామవాంఛ తీర్చలేదని తాళికట్టిన భార్యనే హతమార్చేసాడు ఓ భర్త. అలసటగా ఉండి ఆ క్షణానికి కాదన్నందుకు అర్థం చేసుకోవాల్సింది పోయి భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపేశాడు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం గ్రామంలో దారుణం జరిగింది. తాళి కట్టిన భార్యను భర్త అతి దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సిల్లీ రీజన్‌తో భార్యను చంపేయడం సంచలనంగా మారింది. సంత సీతారంపురం గ్రామానికి చెందిన గాలి అప్పలరెడ్డి, నాగమ్మ ఇద్దరు భార్యాభర్తలు. నాగమ్మ, అప్పల రెడ్డి దంపతులు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె నాలుగేళ్ల కిందటే వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోగా.. కుమారుడు ఉపాధి నిమిత్తం విశాఖలో తాపీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే అప్పల రెడ్డి, నాగమ్మ భార్యాభర్తలు ఇద్దరూ కూలీ పనికి వెళ్లిపోయారు. రాత్రికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేసి నిద్రించే సమయంలో తన కామవాంఛ తీర్చాలని భార్య నాగమ్మను బెడ్రూమ్లోకి రమ్మన్నాడు భర్త అప్పలరెడ్డి. అయితే పగలంతా కూలీ పని చేసి వచ్చిన భార్య అలసటగా ఉండటంతో భర్తతో కలిసేందుకు ఆసక్తి చూపలేదు.
తనకు నిద్ర వస్తోంది.. పడుకుంటానని నాగమ్మ తెలిపింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త అప్పల రెడ్డి భార్య నో అని చెప్పటంతో ఆగ్రహానికి గురయ్యాడు. భర్త కోరిక తీర్చమంటే కాదంటావా.! ఎవరితో అయినా కులుకుతున్నావా అంటూ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో నిద్రిస్తున్న భార్యపై దాడి చేసి చంపేశాడు. విచక్షణారహితంగా నరకడంతో నాగమ్మకు మెడపైన, నుదురుపైన మొత్తంగా శరీరంపై 12చోట్ల కత్తి పోటు గాయాలు అయ్యాయి. నాగమ్మ పడుకుని ఉన్న చోటే రక్తం మడుగులో కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు అప్పల రెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం DSP విద్యా సాగర్ తెలిపారు. నాగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం G.G.Hకి పోలిసులు తరలించారు.
కూరలో ఉప్పు తక్కువయిందనో.. నచ్చిన కూర వండలేదనో.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనో తాళికట్టిన భర్తే.. భార్యను చంపేసిన ఘటనలను గతంలో జరిగాయి. తన కామవాంఛను తీర్చలేదని భార్యను అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. పిల్లలకు పెళ్లిళ్లు చేసి మనవడు, మనవరాళ్లును ఆడిపించాల్సిన వయసులో ఆ క్షణానికి తన దగ్గరకు రాలేనందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడా అంటూ అప్పల రెడ్డి తీరుపై వారి బంధువులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ముందుకు నడవాల్సిన భార్యాభర్తలు క్షణికావేశంతో నిండు నూరేళ్ళ దాంపత్య జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నారంటూ చర్చించుకుంటున్నారు.