

అసలే పేదరికం. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించే దుస్థితి. సొంత ఊరు ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామం. ఉన్నదాంట్లోనే పిల్లలను చదివించాలని కోరిక. వడ్డే ఈరన్న, రాధమ్మ దంపతులు ఉన్న చిన్నపాటి మట్టి మిద్దెలో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. తప్పని పరిస్థితుల్లో వడ్డే ఈరన్న, రాధమ్మకు ఉన్న నలుగురు సంతానంలో ముగ్గురు అమ్మాయిలు, ఒక్క కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. రోజూ తల్లితండ్రులు పడే కష్టం చూడలేక పెద్ద కూతురు 5వ తరగతి వరకే చదువుకుంది. తల్లి, తండ్రితో కలిసి కూలీ పనులకు వెళ్ళేది. రెండవ అమ్మాయి శ్రావణిని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివించారు. ఆ నిరుపేద తల్లితండ్రులు ఆమెను 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివించే అవకాశం కోసం ఎదురుచూశారు. KGBVలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాయించారు. అందులో శ్రావణి మంచి మార్కులతో చిప్పగిరి KGBVలో సీటు సాధించింది. తల్లితండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే అవకాశం తమ కూతురుకు దక్కిందని గ్రామంలో అందరికి చెబుతూ వచ్చారు. అప్పుడప్పుడు చిప్పగిరికి వెళ్ళి కూతురు శ్రావణిని చూసి తల్లితండ్రులు బాగా చదువుకొవాలని చెప్పి వచ్చేవారు. శ్రావణి కూడా చదువులో రాణించే సత్తా ఉన్న అమ్మాయి అని తెలుస్తోంది. మూడో కూతురు కూడా ఆస్పరి కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు ముత్తుకూరు ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఇక వేసవి సెలవులకు తండ్రి ఈరన్నతో పాటు కూతురు శ్రావణి బైక్పై ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి బయలుదేరింది. వారి బైక్ ఆలూరు పెద్దహొతూరు గ్రామ మధ్యలోనికి వెళ్ళే సమయంలో మృత్యువు రూపంలో అతి వేగంతో కర్నూలు నుంచి బళ్ళారి వైపు వెళ్తున్న ట్యాంకర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ను ఢీ కొట్టింది. తండ్రి, కూతురు ట్యాంకర్ చక్రాల కిందపడి నలిగిపోయి అక్కడికక్కడే మరణించారు. ట్యాంకర్ డ్రైవర్ మందు మత్తులో ఉన్నారా లేదా రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ను ఢీకొన్నారా అనే విషయంపై పోలీసుల విచారణ చేపట్టారు. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే శ్రావణితో పాటు చదివే విద్యార్థులు, టీచర్లు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, తన సొంత ఊరు చిప్పగిరి KGBVలో చదువుతూ తండ్రి ఈరన్నతో పాటు మృతి చెందిన శ్రావణి మరణవార్త విని MLA వీరుపాక్షి అవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్ళి మృతదేహాలను పరిశీలించి తన వంతు ఆర్ధిక సాయం చేశారు.