
తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం గ్రామాన్ని ఇప్పటికే కేన్సర్ మహమ్మారి భయపెడుతుంటే.. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి కూడా అలాంటి కష్టమే వచ్చిపడింది. బలభద్రపురం గ్రామంలో కేన్సర్ మహమ్మారి పడగ విప్పితే… పల్లం గ్రామాన్ని లివర్ సంబంధింత వ్యాధులు చుట్టుముట్టాయి. ఆ ఊళ్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో మంచాన పడుతున్నారు. లివర్ ఇన్ఫెక్షన్తో గ్రామస్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో గ్రామస్తులకు ఏమైందోనని భయంతో వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. చర్యలు చేపట్టింది ప్రభుత్వయంత్రాంగం. కలెక్టర్ ఆదేశాలతో వైద్య సిబ్బంది రంగంలోకి దింగింది. గ్రామస్తులందరికీ టెస్టులు చేస్తున్నారు. ఊరిని పట్టిపీడిస్తున్న ఇన్ఫెక్షన్ ఏ స్టేజ్‌లో ఉంది.? ఎన్నేళ్ల నుంచి ఈ వ్యాధి పీడిస్తోందనే కోణంలో అధ్యయం చేస్తున్నారు.
2,200 మందికి లివర్ టెస్టులు
ఆరు వైద్య బృందాలను ఏర్పాటు చేసి.. పల్లం గ్రామంలో దాదాపు 3వేల మంది ఉండగా.. వారికి హెపటైటిస్ బీ, సీ టెస్టులు చేస్తున్నారు. 15 ఏళ్లు దాటిన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఇప్పటివరకు 2,200 మందికి లివర్ టెస్టులు చేశారు. లివర్ టెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 16 HBSAG వైరస్, 9 మందికి HCV వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. గత ఆరేళ్లుగా లివర్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు.
హెపటైటిస్ బీ, సీ వైరస్ ఎక్కువగా ఉంటే కాలేయంపై ప్రభావం
హెపటైటిస్ బీ, సీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే కాలేయంపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు వైద్యులు. ప్రస్తుతం రూ.6 వేలు విలువైన రాపిడ్ టెస్టులు చేస్తోంది వైద్య సిబ్బంది. పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మరికొందరని అమలాపురం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలపై పూర్తి ఫలితాలు వచ్చాక.. ఇన్ఫెక్షన్కి సమస్యలు ఎందుకు తలెత్తాయో స్పష్టమవుతుందంటున్నారు అధికారులు.