
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఖర్చులను ఆదా చేయడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే క్రమంలో ఈ లే-ఆఫ్స్ ఉంటాయని తెలుస్తోంది. 2025లో సుమారు 14 వేల మంది ఉద్యోగులకు లే-ఆఫ్స్ ఇవ్వనుందట అమెజాన్. అంటే.. సంస్థలోని 13 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఈ ఏడాది ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలన్నీ కూడా ఏఐ సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. అలాగే లాభాలను గరిష్టీకరణపై కూడా దృష్టి పెట్టడంతో.. చాలామంది ఉద్యోగులకు లే-ఆఫ్స్ ఇచ్చి పంపిస్తున్నాయ్.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. లేఆఫ్స్‌తో అమెజాన్‌కు ప్రతీ ఏటా 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని సమాచారం. ఈ ఏడాది తొలి క్వార్టర్లో అమెజాన్ లేఆఫ్స్ ప్రకటన చేయనుందట. 1,05,770 మంది ఉద్యోగుల సంఖ్యను.. ఈ లేఆఫ్స్ 91,936కి తగ్గించనుంది. సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి, డెసిషన్ మేకింగ్‌ను మరింత సులభతరం చేయడానికే ఈ లేఆఫ్స్ అని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. 2025 మొదటి త్రైమాసికంలో మేనేజర్లకు వ్యక్తిగత సహకారాన్ని 15 శాతం మేరకు పెంచేలా ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. కంపెనీ బ్యూరోక్రసీని తగ్గించడానికి, కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ లేఆఫ్స్ సహాయపడతాయని అమెజాన్ సీఈఓ అన్నారు.
ఈ ఏడాదిలో దాదాపు 13,843 మంది అమెజాన్ ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ ఓ నివేదిక ఇచ్చింది. ఈ నిర్ణయంతో కంపెనీ గణనీయంగా ఖర్చులను తగ్గించుకుని.. డబ్బును ఆదా చేయగలదని పేర్కొంది. ఈ లేఆఫ్స్‌తో అమెజాన్‌కు ఎక్కువగానే లాభాలు చేకూరుతాయని.. వేతనాల సమీక్ష, డైరెక్ట్ రిపోర్ట్స్ పెరగడం, సీనియర్ రోల్స్ నియామకాన్ని పరిమితం చేయడం లాంటివి ఈ లిస్టులో ఉన్నాయి. కాగా, కోవిడ్ మహమ్మారి సమయంలో తమ పరిధిని పెంచుకునే దిశగా అమెజాన్ అనేక మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. 2019లో, ఈ-కామర్స్ దిగ్గజం 7,98,000 మంది ఉద్యోగులను నియమించుకుంది. 2021 చివరి నాటికి, ఈ సంఖ్య 1.6 మిలియన్లకు పెరిగింది. అయితే ఆ తర్వాత అమెజాన్ లేఆఫ్స్ ప్రారంభించింది. 2022-2023 మధ్య, అమెజాన్ కంపెనీ 27,000 ఉద్యోగాలను తొలగించింది.