
మలయాళ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ ఎన్ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించారు. క్యాన్సర్ బారీన పడిన ఆయన కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి సోమవారం ఉదయం (ఏప్రిల్ 28) కన్నుమూశారు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మలయాళ సినిమాకు చేసిన సమగ్ర కృషికి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జెసి డేనియల్ అవార్డుతో సత్కరించింది.
షాజీ ఎన్ కరుణ్ 1952లో జన్మించారు. ఆయన పల్లిక్కరలో స్కూల్, తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీలో చదువుకున్నారు. ఆ తరువాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1975లో సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందారు. ఆయన కొంతకాలం మద్రాసులో పనిచేసిన ఆయన అనంతరం రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలో ఫిల్మ్ ఆఫీసర్‌గా చేరారు. ఈ సమయంలోషాజీ ప్రఖ్యాత దర్శకుడు జి అరవిందన్‌తో కలిసి పనిచేశారు. తదనంతరం కెజి జార్జ్, ఎంటి వాసుదేవన్ నాయర్ వంటి ప్రముఖుల చిత్రాలకు కెమెరా మెన్‌గా పనిచేశారు.
షాజీ ఎన్ కరుణ్ మొదటి చిత్రం 1988లో విడుదలైంది. ‘ప్రేమ్‌జీ’ నటించిన ‘పిరవి’ మువీ దాదాపు డెబ్బై చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించారు. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా 31 కి పైగా అవార్డులను గెలుచుకుంది. అతని తదుపరి చిత్రం ‘స్వామ్’. 1994లో విడుదలై ఈ మువీ ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ ‘డి’ఓర్‌కు నామినేట్ చేయబడింది. 1999లో మోహన్ లాల్ నటించిన అతని మూడవ చిత్రం వానప్రస్థం కేన్స్‌తో సహా పలు చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. ఆ సినిమా మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. తరువాత మమ్ముట్టి నటించిన కుట్టి స్రాంక్ చిత్రం ఐదు జాతీయ అవార్డులను గెలుచుకుంది. తరువాత స్వపనం (2013), ఓల్ (2018) చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిల్లో ఓల్ కు జాతీయ అవార్డు వచ్చింది.
ఇవి కూడా చదవండి
2011లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 1979లో విడుదలైన థంబ్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీకి గానూ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆయన సినిమాటోగ్రఫీ, దర్శకుడు, నిర్మాత రంగాలలో కలిపి మొత్తం ఏడు జాతీయ అవార్డులు పొందారు. అంతేకాకుండా ఏడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. దాదాపు 40 చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. వాటిలో పిరవి, స్వప్నం, స్వామ్, వానప్రస్థం, నిషాద్, కుట్టిసారంక్, AKG బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి.’స్వామ్’ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన పోటీ విభాగంలో ప్రదర్శించబడిన మొదటి మలయాళ చిత్రం.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.