
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ విలువ పెరుగుతూ పోతోంది. ప్రపంచ దేశాల చూపంతా అమెరికా వైపు మళ్లడంతో డాలర్ పరుగులు తీస్తోంది. డోనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్టు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదానికి కొన్ని బిగ్ టెక్ కంపెనీలు మద్దతు ఇవ్వడంతో డాలర్ బలాన్ని మరింత పెంచుతున్నాయి. డాలర్ ఇండెక్స్ అంటే ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్ తో యూఎస్ డాలర్ విలువను కొలిచే ఆర్థిక సూచిక. గ్లోబల్ ఫైనాన్స్ లో ఇది చాాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా యూఎస్ డాలర్ బలం, బలహీనతలను లెక్కిస్తుంది. దీనిలో బ్రిటీష్ పౌండ్, యూరో, జపనీస్ యెన్, స్వీడిష్ క్రోనా, స్విస్ ప్రాంక్, కెనడియన్ డాలర్ తదితర కరెన్సీలు ఉంటాయి. డాలర్ ఇండెక్స్ బలపడితే రూాపాయి విలువ పడిపోతుంది. మనతో పాటు అనేక దేశాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. పెరుగుతున్న డాలర్ ఇండెక్స్ కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ (ఈఎం) కరెన్సీలకు సవాళ్లు ఎదురవుతాయి.
దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెన్సీ చలామణిలో (సీఐసీ) రూ.78 వేల కోట్లకు పెరిగింది. దాదాపు రూ.35.9 లక్షల కోట్లకు చేరుకుంది. దేశ జీడీపీలో దాదాపు 11 శాతానికి చేరుకుందని ఎస్ బీఐ తెలిపింది. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫారెక్స్ మార్కెట్ లో జోక్యం చేసుకుంది. దీంతో 2024 నవంబర్ నాటికి నికర ఫారెక్స్ అమ్మకాలు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గ్లోబల్ కారణాల కారణంగా రూపాయికి ఎదురుగాలి వీస్తున్నప్పటికీ ఆ పరిస్థితి త్వరలోనే ముగిసిపోతుందని ఎస్ బీఐ చెబుతుంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి తగ్గుముఖం పట్టిన మార్కెట్ పరిస్థితులు స్థిరపడిన తర్వాత రూపాయి విలువ రికవరీ అవుతుందని అంచనా.
మన దేశ ఆర్థిక వ్యవస్థపై డాలర్ ఇండెక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డాలర్ విలువ పెరిగితే మనకు నష్టం కలుగుతుంది. అది తగ్గితే మనకు లాభదాయకంగా ఉంటుంది. ఇండెక్స్ పడిపోయినప్పుడు మన రూపాయి విలువ పెరుగుతుంది. ఫలితంగా యూఎస్ లోని పెట్టుబడిదారులు మన దేశంలో రాబడి కోసం చూస్తారు. ఫలితంగా విదేశీ సంస్థాగత పెట్టబడులు పెరుగుతాయి. తద్వారా స్టాక్ మార్కెట్ లాభపడుతుంది. మన దేశం పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటుంది. డాలర్ ఇండెక్స్ పెరిగినప్పుడు చమురు ధరలు కూడా పెరుగుతాయి. ఇది మనకు నష్టం కలిగిస్తుంది. డాలర్ పెరిగితే మన దిగుమతి ఖర్చులు ఎక్కువవుతాయి. తద్వారా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సి ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..