
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ గురువారం ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు అని ఆయన అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన అంబానీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రదాడిలో గాయపడిన వారందరికీ ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ HN ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామన్నారు. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపారు. ఈ దాడిలో దాదాపు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. “2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిలో అమాయక భారతీయుల మరణం పట్ల రిలయన్స్ కుటుంబ సభ్యులందరితో కలిసి నేను కూడా సంతాపం తెలుపుతున్నాను” అని అంబానీ ప్రకటనలో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ముంబైలోని మా రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ హాస్పిటల్ గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందిస్తుందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి ఎవరూ మద్దతు ఇవ్వకూడదని ఆయన అన్నారు. ఉగ్రవాద ముప్పుపై నిర్ణయాత్మక పోరాటంలో మేం మా ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం, మొత్తం దేశంతో నిలబడతామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..