
శ్రీకాకుళం, ఏప్రిల్ 24: పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏమి ఉండదు. కార్యసాధనలో ఒక్కోసారి ఓటమి ఎదురయినా నిరాశపడకూడదు. అవి తాత్కాలికమే అనుకుని ముందడుగు వేస్తూ పోవాలి. అనుకున్నది సాధించెంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడు తప్పకుండా ఏదో ఒకరోజు విజయం మన సొంతం అయి తీరుతుంది. అనుకున్నది తప్పక నెరవేరుతుందని నిరూపించాడు సిక్కోలు జిల్లాకు చెందిన బాన్న వెంకటేష్. 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా లెవల్ లో 15వ ర్యాంక్ సాధించి తెలుగోడి సత్తా చాటాడు.
బాన్న వెంకటేశ్ స్వస్థలం జలుమూరు మండలంలోని అల్లాడపేట అనే మారుమూల గ్రామం. వారిది ఓ సాధారణ రైతు కుటుంబం. కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల నుండి స్ఫూర్తి పొందాడు వెంకటేష్. చిన్నప్పటి నుండి చదువుల్లో చురుకుగా ఉండే వెంకటేష్ IAS కావాలని భావించాడు. ఒకటి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం అంతా శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగింది. ఇంటర్ విశాఖలో పూర్తిచేశాడు. IIT ఖరగ్ పూర్ లో సివిల్ లో సీటు వచ్చినప్పటికీ గ్రూప్ నచ్చక తమిళనాడు లోని NIT తిరుచనాపల్లిలో తన ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అనంతరం సాప్ట్ వేర్ ఇంజినీర్ గా రెండేళ్లు పూర్తి చేసి సివిల్స్ రాయాలన్న ఆశయంతో ఆ జాబ్ కి రిజైన్ చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.
తొలి ప్రయత్నంలో వెంకటేష్ విఫలం అయ్యాడు. దగ్గరలోనే ఆయనకు సివిల్స్ ర్యాంక్ మిస్సైంది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. మళ్లీ ప్రయత్నం చేసాడు. 2023 సివిల్స్ ఫలితాల్లో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికయ్యాడు వెంకటేష్. ప్రస్తుతం హైదరాబాద్లో IPS శిక్షణలో ఉన్నాడు. అయితే IAS కావాలన్న సంకల్పంతో IPS శిక్షణ పొందుతూనే మరల సివిల్స్ పరీక్షలు రాయాగా 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించాడు. దీంతో వెంకటేష్ కి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు వెంకటేష్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆయన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యువతకు వెంకటేష్ స్ఫూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు.
ఇవి కూడా చదవండి
UPSC Civils 2024 Topper
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.