
అమరావతి, ఏప్రిల్ 24: ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేసవి సెలవులను ప్రకటించాయి. షెడ్యూల్ ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏప్రిల్ 23వ తేదీ (బుధవారం)తో ముగిసింది. చివరి రోజు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. దీంతో గురువారం (ఏప్రిల్ 24) అన్ని విద్యాసంస్థలకు సెలవులు అమలులోకి వచ్చాయి. వేసవి సెలవులు జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి.
బుధవారం పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కేరింతలు కొడుతూ ఇళ్లకు చేరుకున్నారు. హాస్టల్ విద్యార్థులు కూడా అధిక సంఖ్యంలో ఇంటిబాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలన్నీ మూత పడ్డాయి. హాస్టళ్లలో ఇన్నాళ్లు ఉన్న విద్యార్థులు తమ ట్రంకు పెట్టెలు, బ్యాగులతో ఇళ్లకు బయల్దేరారు. కాగా ఇప్పటికే స్టేట్, సెంట్రల్ సిలబస్‌కు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తి చేయగా.. విద్యార్ధులకు మార్కులను కూడా అందించారు.
అయితే ఏపీలో జూనియర్ కాలేజీలు జూన్ 2న తిరిగి తెరచుకోనున్నాయి. కాస్త ముందుగానే ఇంటర్ విద్యార్ధులకు విద్యా సంవత్సరం ప్రారంభించాలని అధికారులు ఈ మార్పు చేశారు. ఇక పాఠశాలలు మాత్రం కొత్త విద్యా సంవత్సరం(2025-26) జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 6న విధుల్లో చేరాలని ఏపీ విద్యా శాఖ ఆదేశించింది. అటు తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం జూన్ 13 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అంటే వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు ఇచ్చారన్నమాట. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగవద్దని, ముఖ్యంగా చెరువులు, కుంటలు, బావుల వద్దకు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విద్యాశాఖ అధికారులు బడి పిల్లలకు సూచించారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.