

కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ ముందుండే వారని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాష్ తెలిపారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం.. ముఖ్య అతిథి ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ..‘‘ఈ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే మహాభాగ్యాన్ని నాకు కల్పించిన అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ దేవర గారికి, ట్రెజరర్ బి. మనోహర్ గారికి, మొత్తం సభ్యులందరికీ నా వందనాలు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పగా అవడానికి కారణం ముక్కురాజు మాస్టర్. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్. ఆయనలోని మానవీయకోణానికి శిరస్సువంచి నమస్కారం చేస్తున్నా. ఎంతో గొప్పతనం ఉన్న మంచి మనిషి. 24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఇలాంటి మహానుభావులే. 24 క్రాఫ్ట్స్ ఫెరడేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడం. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ ముక్కురాజు మాస్టర్ పని చేశారు. అందుకే నాకు ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగింది. అసోసియషన్లో ప్రస్తుతం 600 మంది డ్యాన్సర్స్ ఉన్నారంటే ముక్కురాజు మాస్టర్ వేసిన బలమైన పునాదే కారణం. సినీ పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నా.’’ అని చెప్పారు.
ముక్కురాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి..
ఈ సందర్భంగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..‘‘ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ లేదు. డ్యాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా ఫెడరేషన్ పూర్తి అయ్యేది కాదు. ఆ టైమ్‌లో ఏ నమ్మకంతోనో ముక్కురాజు మాస్టర్ వచ్చి డ్యాన్సర్స్ యూనియన్ స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టంతోనే ఇవాళ అసోసియేషన్ ఉంది. ముక్కురాజు మాస్టర్ గారిని ప్రతి సినిమాతో ఆర్. నారాయణమూర్తిగారు ఎంకరేజ్ చేశారు. అలాంటి ముక్కురాజు గారికి అసోసియేషన్ ఆఫీస్ వద్ద విగ్రహం పెట్టడం సంతోషంగా ఉంది. మన డ్యాన్సర్స్ ప్రస్తుతం జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ కమిటీకి అభినందనలు.’’ అని చెప్పారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘ముక్కురాజు మాస్టర్ గారిని నేను 1986లో కలిశాను. నాకున్న టెంపర్‌కు ఒక డ్యాన్సర్‌తో గొడవ జరిగితే ఆయన వచ్చి సెటిల్ చేశారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఏర్పడింది. ముక్కురాజు మాస్టర్ గారు పూనుకోవడంతోనే ఇప్పుడు అసోసియేషన్ ఇక్కడ ఉంది. వాళ్లు గొప్ప ఆశయాలతో పని చేశారు. వాళ్ల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. అందరూ ఏకతాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఛాంబర్ సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది.’’ అని తెలిపారు.
ముక్కురాజు మాస్టర్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్..
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ..‘‘చరిత్రను మర్చిపోకుండా చరిత్రకారులను స్మరించుకోవడం నిజంగా డాన్సర్ యూనియన్ అభినందనీయులు. ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈ యూనియన్ లేదు. అలాంటి మహాపురుషుడిని ఈ విగ్రహం పెట్టి అమరుడిని చేశారు. మనస్ఫూర్తిగా డ్యాన్సర్ యూనియన్ అందరికీ అభినందనలు’’ అని తెలిపారు.ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ..‘‘ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటాం’’ అని తెలిపారు.
అమ్మిరాజు మాట్లాడుతూ..‘‘ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్‌లో చాలా తక్కువ యూనియన్స్‌కు ఇలాంటి అద్భుతమైన సొంత భవనాలున్నాయి. ఇదంతా డాన్సర్స్ అసోసియేషన్ గొప్పతనం. ఆర్ నారాయణమూర్తి గారి చేతుల మీదుగా ముక్కురాజు మాస్టర్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉంది. డాన్సర్స్ యూనియన్‌కు నా అభినందనలు.’’ అని తెలిపారు.
ముక్కురాజు మాస్టర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌టీడీడీఏ ఉపాధ్యక్షులు M. బసవరాజు, K. సురేష్, జాయింట్ సెక్రెటరీలు సిరిగినేడి రామకృష్ణ, G.బాల కృష్ణ, కార్యవర్గ సభ్యులు K. కోకిల, K. శ్రీదేవి, K. సతీష్ గౌడ్, K. చిన్నా, P. సదానందం, P. సురేష్, P. నరసింహుడు, G. మహేశ్ కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.