
తెల్లటివన్నీ పాలు కాదు.. ఇది తెలిసిన ముచ్చటే. ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే.. తెల్లగా నురగలు కక్కేదంతా కల్లు కాదు. అది మిమ్మల్ని మంచాన పడేసే, మరణ శాసనం రాసే విషం కూడా కావొచ్చు..! ఎండాకాలం కాస్త చలువ చేస్తోందని కల్లు తాగితే.. బతుకు షెడ్డూకే అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. తెలంగాణలో కల్తీ కల్లు ప్రవాహం.. విచ్చలవిడిగా సాగుతోంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా కొన్ని ప్రాంతాల్లో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ప్రధానంగా మూడు రకాల కల్లు అందుబాటులో ఉంటుంది. తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుంచి కల్లు తీస్తారు. చెట్ల నుంచి సహజంగా ఉత్పత్తయ్యే కల్లుతో సమస్య ఏం లేదు. కానీ కొందరు రసాయనాలు ఉపయోగించి.. కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దగా నగదు ఖర్చు పెట్టలేని పేదలే కల్లు తాగుతూ ఉంటారు. అలాంటివారు కల్తీ కల్లు తాగి చిత్రవిచిత్రమైన లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జోరుగా ‘కల్తీ’ కల్లు మాఫియా రెచ్చిపోతోంది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక కూలీలు, పేదలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కల్లు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన తెలంగాణ అబ్కారీ శాఖలో కొందరు అధికారులు వారిచ్చే ముడుపులు పుచ్చుకుని నోరు మెదపడం లేదనే ఆరోపణలున్నాయి.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 30కి పైగా కల్లు దుకాణాలు నడుపుతున్నారు. కొంత మంది వ్యాపారులు.. రసాయనాలతో కల్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్పాజోలమ్, వైట్ పేస్ట్ వంటి ప్రమాదకరమైన రసాయణాలను వినియోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ కల్తీ కల్లు తాగి శేరిలింగంపల్లి పరిధిలో వందల సంఖ్యలో అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువరు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మీడియాలో వరుస కథనాలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కల్తీకల్లు మూలాలపై యాక్షన్ మొదలు పెట్టింది అధికార యంత్రాంగం. అయితే రాష్ట్రమంతా కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్ సేకరించినా.. శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇంత పెద్ద అంశాన్ని లైట్‌గా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్టేషన్ సీఐ సెలవులో ఉండటంతో ఎస్ఐలే బాసులుగా మారిపోయారు. తాము చెప్పిందే చట్టం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇంచార్జ్ సీఐను సైతం పక్కనబెట్టి వారే పెత్తనం సాగిస్తున్నారని ఎక్సైజ్ శాఖలోనే చర్చ జరుగుతుంది.
ఇంతమంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లును ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు..? తరచుగా తాము శాంపిళ్లు సేకరిస్తామని చెబుతున్న అధికారులు.. ఎన్ని షాపులపై కేసులు పెట్టారో తెలుపమంటే మాత్రం.. తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఈ అంశంపై కలగజేసుకుని.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుని.. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..