
ద్వాదశ రాశుల్లో కొన్ని రాశుల వారి తీరే వేరు. వీరు ఎవరి మాటా వినరు. సంప్రదాయాలను పాటించరు. నిర్ణయం తీసుకుంటే ఒక పట్టాన మార్చుకోరు. ఎటువంటి సమస్యనైనా, సవాలునైనా ఒంటిరిగానే ఎదుర్కొంటారు. ఈ రాశులుః మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకరం. ఈ రాశుల వారు సాధారణంగా ఇతరుల మీద ఆధారపడరు. వీరి మనస్తత్వానికి తగ్గట్టుగా ఈ ఏడాది కొన్ని గ్రహాలు కూడా వీరికి బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులను ఏమాత్రం లెక్క చేయకుండా వీరు ముందుకు దూసుకుపోతారు. తమ లక్ష్యాలను చేరుకుంటారు.
- మేషం: ఈ రాశివారికి ఏడున్నరేళ్ల ‘ఏలిన్నాటి శని’ మొదలైంది. వృత్తి, ఉద్యోగాల్లో, సంపాదనలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారికి అటువంటివేమీ పట్టవు. తమ రూటు మార్చుకుని, చిన్న చిన్న అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతారు. పక్కన పిడుగులు పడినా చలించని ఈ రాశివారికి ఈ ఏడాదంతా రాశ్యధిపతి కుజుడు, శుక్రుడు, రవి అనుకూలంగా ఉన్నందువల్ల సాహసాలు చేస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ పురోగతి చెందుతారు.
- మిథునం: ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. తమ తెలివితేటల మీద నమ్మకం ఒక మోతాదు అధికం గానే ఉంటుంది. బుద్ధి కారకుడైన బుధుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఎటువంటి సమస్య నైనా పరిష్కరించుకుంటారు. వివాదాలను అవసరమైతే రాజీమార్గంలో పరిష్కరించుకుని ముందుకు వెడతారు. ఈ ఏడాదంతా ఈ రాశికి బుధ శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, షేర్లు, స్పెక్యులేషన్లలో కూడా రాణిస్తారు.
- సింహం: ఈ రాశివారికి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. ఏటికి ఎదురీదడానికి వీరు వెనుకాడరు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత వీరి మాట వీరే వినరు. ఈ రాశికి అధిపతి రవి అయినందువల్ల నాయకత్వ కలిగి ఉంటారు. అష్టమ శని ప్రారంభమైనప్పటికీ, వీరు కష్టాలు పడుతున్న సూచనలు కనిపించకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. గురు, రవి, కుజుల అనుకూలత వల్ల ఈ ఏడాది వీరు అనేక ఘన కార్యాలు సాధించే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సర్వ స్వతంత్రుడు. అందువల్ల ఇతరులతో సంప్రదించడమనే లక్షణం ఈ రాశివారిలో తక్కువ. మూడో కంటికి తెలియకుండా వీరు తమ వ్యవహారాలను చక్క బెట్టుకుంటారు. అదృష్టానికి, ఆదాయానికి కారకుడైన గురువు ఈ రాశివారికి ఈ ఏడాదంతా అనుకూలంగా లేనప్పటికి, వీరు ఆదాయాన్ని కూడబెట్టే వారిలో, మదుపు చేసేవారిలో ముందుంటారు. రాశ్యధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా తమ లక్ష్యాలను సాధిస్తారు.
- ధనుస్సు: ఈ రాశివారిలో అందరి కంటే ముందుండాలనే కోరిక కాస్తంత ఎక్కువగా ఉంటుంది. రాశ్యధిపతి గురువు అదృష్టానికి, ఆదాయానికి కారకుడైనందువల్ల, ఈ రాశివారిలో ‘యాంబిషన్’ అనేది ఒక మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోరు. సాహసాలు చేయడానికి ఇష్టపడే ఈ రాశివారు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సంపా దనలో కూడా బాగా పురోగతి సాధిస్తారు. అర్ధాష్టమ శని బాధలను వీరు లెక్కచేయకపోవచ్చు.
- మకరం: కష్టనష్టాలను, సుఖ సంతోషాలను సమదృష్టితో చూసే ఈ రాశివారు ఈ ఏడాది బాగా పురోగతి చెందే అవకాశం ఉంది. అదృష్టాన్ని కలిగించే గురువు ఈ ఏడాదంతా అనుకూలంగా లేకపోయినా రాశ్యధిపతి శనీశ్వరుడి అనుకూలత వల్ల గట్టి పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో అనుకున్నవి సాధించుకుంటారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శ్రమాధిక్యత ఉన్నా అనేక మార్గాల్లో ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు.