

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పందిరి అశ్విత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులే సాధించినప్పటికీ.. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేదు.. దీంతో ఫెయిల్ అయ్యానన్న ఆవేదనతో మనస్తాపానికి గురైన అశ్విత.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. దీంతో అశ్విత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లక్షేట్టిపేట మండల కేంద్రంలోని గోదావరి రోడ్‌కు చెందిన పందిరి భూమన్న కూతురు పందిరి అశ్విత (16) స్థానిక ప్రైవేట్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకు గాను 189 మార్కులు సంపాదించింది. కానీ ఇంగ్లీష్ ప్రాక్టికల్ కు హాజరు కాకపోవడంతో 20 మార్కుల పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు.. రిటర్న్ పరీక్షల్లో పాసైనా ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కాకపోవడంతోనే ఫెయిల్ అయ్యాననే మనోవేదనకు గురైంది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తండ్రి పందిరి భూమన్న చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తుండగా.. తల్లి పందిరి లక్ష్మి నాలుగేళ్ల క్రితం కరోనా సమయంలో అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలికి ఎనిమిది తరగతి చదువుతున్న ఓ సోదరుడు ఉన్నాడు. అశ్విత మరణ వార్తతో లక్షేట్టిపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమను ఒంటరిని చేసి వెళ్లిపోయావా తల్లి అంటూ తండ్రి భూమన్న రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..