
మనలో చాలామందికి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అదేంటంటే.. మనం వాడే ఫోన్ నెంబర్ లేదా వెహికిల్ నెంబర్ ఇలాంటి ముఖ్యమైనవి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరి దగ్గరైనా చెప్పుకోవడానికి కానీ, లేదా మన కోసం మనం సంతృప్తి చెందడానికి ఇలాంటివి ఖచ్చితంగా పాటిస్తుంటాం. అలా ఇప్పుడు హైదరాబాద్-పాతబస్తీ వేదికగా ఫ్యాన్సీ నెంబర్ల కరెన్సీ నోట్ల ఎగ్జిబిషన్ సందడి నెలకొంది. మరి ఏంటిది.. ఎప్పుడు ప్రారంభమైందనే విషయాలు తెలుసుకుందాం.
ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. అది కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. అలాంటి స్పెషల్ నెంబర్లకు, ప్రత్యేక ఫ్యాన్సీ నెంబర్లకు మార్కెట్లో మంచి రేటు కూడా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు కూడా ఎక్కువేనట. పాతబస్తీ-మొఘల్పురాలోని ఉర్దూ ఘర్లో సోమవారం అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. దీనికి పెద్దఎత్తున ప్రజలు కూడా తరలివచ్చి ఫ్యాన్సీ నెంబర్లు ఉన్న పాత కరెన్సీ నోట్లను ఆసక్తిగా తిలకించారు. అయితే.. ఈ ఎగ్జిబిషన్ కేవలం కళ్లతో చూసి ఆనందించడం వరకే కాదు.. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ నోట్లను కొనుక్కోవచ్చు.. లేదా మన దగ్గర ఇలాంటి నోట్లు భారీ రేటుకు అమ్ముకోవచ్చు కూడా. ధరలు కొంచెం భారీగా ఉంటాయి కానీ, ప్రత్యేకత ఉంటుంది అలాంటి నోట్లకు. అందుకే ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధపడి ఆ కరెన్సీని కొనుగోలు చేస్తున్నారు కొందరు.
అయితే.. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ కలిగి ఉండే నోట్లు పది లక్షల్లో ఒకటో, రెండో ఉంటాయని.. ఇవి అత్యంత అరుదుగా లభించేవి కాబట్టే ఇంతటి క్రేజ్ అని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే మార్కెట్లో ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ల నోట్లకి భారీ డిమాండ్ ఉంటుంది. పాతబస్తీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ముస్లింలు ఈ ప్రదర్శనకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు కూడా ఇక్కడ భారీ డిమాండ్ ఉందని నిర్వాహకులు అంటున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయ వచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.