

పాములు తమ చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని పొందడం ప్రకృతిలోని అద్భుతమైన ప్రక్రియల్లో ఒకటి. ఈ ప్రక్రియనే కుబుసం విడువడం అని.. ఎక్డిసిస్ అని పిలుస్తుంటారు. ఇది పాముల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం రాల్చడం వల్ల పాములు ఎక్కువ కాలం జీవించే సామర్థ్యాన్ని సాధిస్తాయి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాయి, పర్యావరణ మార్పులకు అనుగుణంగా జీవిస్తాయి. ఈ సహజ విధానం పాముల శరీర వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం.
అందుకే కుబుసం విడిచిపెడ్తాయి:
పాములు తమ చర్మాన్ని రాల్చడం లేదా కుబుసం విడిచిపెట్టడం అనేది ఒక సహజ ప్రక్రియ. ఈ ప్రక్రియను ఎక్డిసిస్ అంటారు. ఇది పాముల ఆరోగ్యానికి, అభివృద్ధికి అవసరం. చర్మం రాల్చడం వల్ల పాములు పరాన్నజీవులను తొలగించుకుంటాయి. పర్యావరణ మార్పులకు అనుగుణంగా ఉంటాయి.
పాముల చర్మం సాగదు. అందుకే పెరుగుదలకు అనుగుణంగా చర్మాన్ని రాల్చుతాయి. ఈ ప్రక్రియలో పాత, బిగుతైన చర్మం తొలగిపోతుంది. కొత్త, పెద్ద చర్మం ఏర్పడుతుంది. ఈ విధంగా పాములు తమ శరీర పరిమాణాన్ని పెంచుకుంటాయి.
పరాన్నజీవుల తొలగింపు:
చర్మం రాల్చడం వల్ల పాములు పరాన్నజీవులను, ధూళిని, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. పాత చర్మంపై ఉండే ఈ అవాంఛిత పదార్థాలు రాలిపోవడంతో పాము ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియ శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.
పర్యావరణ అనుకూలత:
చర్మం రాల్చడం పాములకు పర్యావరణ మార్పులకు అనుగుణంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఉష్ణోగ్రత, తేమ వంటి మార్పులకు తట్టుకునేందుకు కొత్త చర్మం రక్షణ ఇస్తుంది. ఈ విధంగా పాములు తమ జీవనాన్ని కొనసాగిస్తాయి.
పాములు ఇలా పెరుగుతాయి:
ఇవి కుబుసం ఎప్పుడు విడిచి పెడ్తాయి అనే విషయం పాము వయస్సు, జాతి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. చిన్న పాములు త్వరగా పెరుగుతాయి. కాబట్టి తరచూ చర్మాన్ని రాల్చుతాయి. పెద్ద పాములు తక్కువ సార్లు రాల్చుతాయి. ఆరోగ్యవంతమైన పాము సాధారణంగా నిర్దిష్ట కాలానికి ఒకసారి చర్మాన్ని మార్చుకుంటుంది.
ఆ సమయంలో ఈ లక్షణాలుంటాయి:
కుబుసం రాల్చే ముందు పాము కళ్ళు మసకబారుతాయి. చర్మం నీరసంగా కనిపిస్తుంది. పాము గట్టి ఉపరితలాలపై రుద్దుకుంటూ పాత చర్మాన్ని వలిచివేస్తుంది. కొన్నిసార్లు చర్మం ఒకే భాగంగా, కొన్నిసార్లు పొలుసులుగా రాలిపోతుంది. ఈ ప్రక్రియ పాము జీవనంలో కీలకమైనది.